ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఇప్పటి వరకూ మాకున్నంత సమాచారం మేరకు అమరావతినే ఏపీ రాజధాని అని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో క్లారిటీ ఇచ్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీ రాజధాని విషయంలో సందిగ్ధం నెలకొందని, 3 రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్న తర్వాత రాజధాని ఏదో తెలియడం లేదని .. కేంద్ర ప్రభుత్వం వద్ద సమాచారం ప్రకారం ఏపీ రాజధాని ఏది? ఎవరు నిర్ణయం తీసుకోవాలి అని ప్రశ్నించారు. దీనికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు.
రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదేనని చెప్పిన కేంద్రమమంత్రి మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని క్లారిటీ ఇచ్చారు. మొదట ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మాకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత 3 రాజధానులని, పాలనా రాజధానిగా విశాఖపట్నం, జ్యుడీషియల్ కేపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి అని తర్వాత చెప్పారన్నారు. ఆ బిల్లులను వెనక్కి తీసుకున్నట్టు అధికారికంగా తమకు తెలియదని.. మేం కూడా వార్తల ద్వారా తెలుసుకున్నామని..కేంద్ర హోంశాఖ సహాయమంత్రి చెప్పారు.
అయితే కేంద్రం వద్ద ఉన్న సమాచారం ప్రకారం అమరావతే రాజధాని అయితే రెండు రోజుల కిందటే ఆర్బీ నుంచి రాజధాని ఏదో తేల్చిన తర్వాతే ప్రాంతీయ కార్యాలయం పెడతామంటూ లేఖ రావడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. కేంద్రంలోని ఒక్కో విభాగం.. ఏపీ రాజధాని విషయంలో ఒక్కోలా స్పందిస్తోంది.