జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న బడ్జెట్ అద్భుతంగా ఉందని ట్వీట్ చేశారు. అయితే అది దేశం మొత్తానికి సంబందించిన స్పందన. తెలుగు రాష్ట్రాల వరకూ అయితే ఆయన నిరాశ వ్యక్తం చేశారు. ఈ రోజు పోలవరం ప్రాజెక్టుకు నిధుల అంశంపై ట్వీట్ చేశారు. అయితే ఆయన ట్వీట్లో ప్రధానంగా వైసీపీ ఎందుకు నిధులు రాబట్టలేకపోయిందో ప్రశ్నించారు. ఎంపీలు ఏం చేస్తున్నారో ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు దుస్థితి ఎలా ఉండేది… ఎలా అయిందో చెప్పారు. అంత వరకూ బాగానే ఉన్నా.. అసలు తన స్పందనలో ఎక్కడా.. నిధులు ఇవ్వాల్సిన బీజేపీ ని ప్రశ్నించే ప్రయత్నం చేయలేదు.
పోలవరం జాతీయ ప్రాజెక్ట్. వంద శాతం నిధులు భరిస్తామని కేంద్రం పార్లమెంట్ చట్టం ద్వారా అంగీకరించారు. చంద్రబాబు ఉన్నప్పుడు నిధులు ఇచ్చినా గత రెండున్నరేళ్ల కాలంలో ఇచ్చిందేమీ లేదు. ప్రతీ దానికి కొర్రీలే. ఫలితంగా ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. వైసీపీ అడగలేకపోతోందనేది బహిరంగసత్యం. అంత మాత్రాన అలుసుగా తీసుకుని బీజేపీ ఏపీకి అన్యాయం చేస్తుంది. దేశానికి ఓ గొప్ప సంపదగా మారే పోలవరం విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు..? ఇలాంటి విషయాలను పవన్ కల్యాణ్ బీజేపీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడానికి సాహసించలేకపోయారు.
గతంలో స్టీల్ ప్లాంట్‌పై ఉద్యమం చేసినప్పుడు కూడా బీజేపీని కాకుండా కేవలం వైసీపీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ చేస్తున్నది రాష్ట్ర ద్రోహమే.. నోరెత్తకపోవడం వారి బలహీనత. అంత మాత్రాన.. వారినే విమర్శించి రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు. కేంద్రాన్ని కూడా ప్రశ్నించాలి. అసలు ఇవ్వాల్సింది వారు ఇవ్వడం లేదేమిటని అడగాలి. కానీ పవన్ కల్యాణ్ కూడా రాజకీయాలను బాగా వంట బట్టించుకున్నట్లుగా ఉన్నారు. కేవలం వైసీపీని మాత్రమే ప్రశ్నిస్తున్నారు.