ఈసారి ఆస్కార్‌పై ఆశలు చిగురింప జేసిన సినిమా `జై భీమ్`. దేశ వ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు పొంది, పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికైన `జై భీమ్` ఆస్కార్ కి కూడా వెళ్లింది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో మన దేశం తరపున పోటీ పడింది. ఈసారి `జై భీమ్`కి అవార్డు రావడం గ్యారెంటీ అని విశ్లేషకులు జోస్యం చెప్పారు. `జై భీమ్` చిత్రబృందం కూడా ఆస్కార్ బరిలో చివరి వరకూ తీసుకురావాలని గట్టి ప్రయత్నాలు చేసింది. కానీ.. అవేం నెరవేరలేదు. ఆస్కార్ కమిటీ ప్రకటించిన తుది జాబితాలో.. జై భీమ్ కి చోటు దక్కలేదు. దాంతో.. జై భీమ్ టీమ్ తో పాటు, దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో నిరాశ ఎదురైంది.
మార్చి 27న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగబోతోంది. ఈలోగా… ఈ అవార్డు కోసం పోటీ పడుతున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్రాల తుది జాబితాని ఆస్కార్ కమిటీ ఈరోజు ప్రకటించింది. అందులో `జై భీమ్` కిచోటు దక్కలేదు. అయితే ఈ ఉదయం నుంచీ… ట్విట్టర్లో `జై భీమ్` హంగామా మొదలైపోయింది. `జై భీమ్`కి ఆస్కార్ తుది జాబితాలో చోటు దక్కిందని, ఉత్తమ విదేశీ చిత్రం కేటరిగీలో `జైభీమ్`కే అవార్డు దక్కే అవకాశాలు ఉన్నాయని లీకేజీలు వచ్చాయి. దాంతో… నిజంగానే `జై భీమ్` తుది జాబితాలో చోటు దక్కించుకుందేమో అని ఆనందించారంతా. కానీ.. కొద్ది సేపటికే ఆ ఆనందం ఆవిరైంది. తుది జాబితాలో అసలు ఈ సినిమా పేరే లేకుండా పోయింది. ఆస్కార్ సాధించకపోతేనేం.. దేశ వ్యాప్తంగా సినీ అభిమానుల గుండెలకు చేరువైంది జై భీమ్. భారతదేశం తరపున తయారైన కొన్నిఉత్తమ చిత్రాల్లో జై భీమ్ ఒకటని నిస్సందేహంగా చెప్పొచ్చు.