వివాదాస్పద వ్యాఖ్యలను కట్టి పెట్టి ఇక కదనరంగంలోకి దిగాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిసైడయ్యారు. ఈ సారి ఆయన ఉత్తరాంధ్ర మీద దృష్టి పెట్టారు. విశాఖ వెళ్లి ఉత్తరాంధ్ర నేతలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల స్థితిగతులను తెలుసుకున్నారు. ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని గుర్తించారు. అందుకే పోరుబాట పట్టాలని డిసైడయ్యారు.
ప్రాజెక్టుల నిర్మాణాన్ని, వ్యవసాయ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిన కారణంగా లక్షలాది ఎకరాల్లో సరైన పంటలు పండించుకునే అవకాశాలను ఉత్తరాంధ్ర రైతులు కోల్పోయారని సోము వీర్రాజు ఆవేదన చెందుతున్నారు. అందుకే ఉత్తరాంధ్ర ప్రాంత రైతులు, ఇతర రాష్ట్రాలు,ప్రాంతాలకు, వ్యవసాయ కూలీలుగా, కార్మికులుగా వలసలుపోతున్నారని అంటున్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ఉద్యమం చేయాలని సంకల్పించారు. ఉద్యమ ఎజెండాను కూడా ఖరారు చేశారు.
ఉత్తరాంధ్ర జిల్లాలోని ఒకొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.5 కోట్లు చొప్పున ఉత్తరాంధ్ర జిల్లాల్లో రూ.300 కోట్లు నీటిపారుదల, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం వెచ్చిస్తే ఆ ప్రాంతంలో 5 లక్షల ఎకరాలకు నీరు లభిస్తుందని సోము వీర్రాజు లెక్క గట్టారు. ఇదే ఉత్తరాంధ్ర జిల్లాల్లో 5 రోజుల పాటు ఉద్యమాన్ని నిర్వహించి ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని నిర్ణయించారు. ఎప్పడు నిర్వహించాలనేది త్వరలోనే ఖరారు చేస్తారు.