ఇటీవల `డీజే టిల్లు` ప్రెస్ మీట్లో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న.. వివాదాస్పదమైంది. `పుట్టుమచ్చల`కు సంబంధించిన ఆ ప్రశ్న వైరల్ గా మారింది. ఆ ప్రశ్న హీరోయిన్ ని బాగా ఇబ్బంది పెట్టింది. బాధ పెట్టింది. ఆ ప్రెస్ మీట్ అవ్వగానే సదరు హీరోయిన్ కంట నీరు పెట్టుకుంటూ, అక్కడ్నుంచి హడావుడిగా వెళ్లిపోయింది. ఆ ప్రశ్న కు సంబంధించి చాలా రభస జరిగింది. చివరికి.. రిపోర్టర్ `సారీ` కూడా చెప్పాడు. ఈ ప్రశ్నతో.. టాలీవుడ్ పీఆర్వో బృందం మేలుకుంది. ఇక మీదట ప్రెస్ మీట్లో.. ప్రశ్నలు అడుగుతున్నప్పుడు వాళ్లపై కెమెరా పెట్టకూడదని, సంచలనం కోసం ఏమైనా అడిగేసే వాళ్లకు అసలు మైక్ ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చింది.
ఇప్పుడు యూ ట్యూబ్ ఛానళ్ల ప్రభావం, ప్రాబల్యం బాగా పెరిగిపోయింది. ప్రతీదీ వాళ్లకు సంచలనమే. ప్రశ్న అడిగేవాళ్లపై కూడా కెమెరాలు ఫోకస్ చేస్తున్నాయి. ఎప్పుడైతే ఈ కల్చర్ పెరిగిందో.. టీవీల్లో కనిపిస్తామన్న అత్యుత్సాహంతో… అడగాల్సినవీ, అడక్కూడనవి కూడా అడిగేస్తున్నారు కొంతమంది రిపోర్టర్లు. `ఆర్.ఆర్.ఆర్` ప్రెస్ మీట్లో కొంతమంది పాత్రికేయులు అడిగిన ప్రశ్నలు మరీ సిల్లీగా ఉండడంతో.. అవన్నీ బాగా ట్రోల్ అయ్యాయి. వాటివల్ల పెద్దగా డ్యామేజీ ఏం లేదు గానీ, `డీజే టిల్లు` వ్యవహారంతో… స్టేజీమీదున్నవాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు. `ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా వేస్తారా..` అంటూ ఆ తరవాత హీరో, హీరోయిన్లు ట్వీట్లు వేసి తమ బాధని, అసహనాన్ని వ్యక్తం చేశారు. అందుకే ఆ గొడవలేం ఉండకూడదని పీఆర్వో యూనియన్ ఈ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. `డీజే టిల్లు` ప్రెస్ మీట్లో ఇబ్బందికరమైన ప్రశ్న అడిగిన జర్నలిస్టుతో సారీ చెప్పించింది కూడా ఆ సినిమా పీఆర్వో బృందమే.