ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని మోడీ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో రచ్చ రచ్చ అవుతోంది.కానీ ఏపీ పార్టీలకు మాత్రం చీమ కుట్టినట్లయినా లేదు. అయితే రాష్ట్ర విభజన చట్టబద్ధంగా జరగలేదని న్యాయపోరాటం కూడా చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఉండబట్టలేకపోయారు. ప్రెస్ మీట్ పెట్టి ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పార్లమెంట్లో ప్రధాని అన్న మాటలు వంద శాతం నిజం అని ..విభజన బిల్లును లోపభూయిష్టంగా ఉందని.. చర్చ లేకుండా ఆమోదించారని ఉండవల్లి విమర్శించారు.
రాజధాని లేకుండా బిల్లు ఎలా రూపొందిస్తారని ప్రశ్నించారు. తలుపులు మూసేసి ప్రజాస్వామ్య విరుద్ధంగా విభజన చేశారన్న మోదీ మాటలు కరెక్టేనన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అలుసైపోయిందని.. ప్రధాని అన్న మాటలన్నా ఒక్క ఎంపీ కూడా నోటీసు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు అడిగినన్నీ సీట్లు ఇచ్చి చక్రవర్తిగా కూర్చోబెట్టారని .. మోదీ అన్న మాట మాటలనే ఆయకు గుర్తు చేసి.. విభజన అంశాలపై ప్రస్తావించాలని.. తమకు ఎందుకు ముంచేశారో అడగాలని జగన్ను కోరారు. రాబోయే రోజుల్లో ఏపీ అంటే అసలు ఎవరూ పట్టించుకోరని నిర్వేదం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు బీజేపీకి మద్దతుగా ఉంటున్నాయని విమర్శించారు. విభేధించిన ప్రాంతీయ పార్టీల నేతలను బీజేపీ కేసులతో భయపెడుతోందన్నారు. ఇప్పుడు పట్టించుకోకపోతే ఏపీకి ఇక ముందు ఎవరూ పట్టించుకోరన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. జగన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటికే విభజన చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా చేశారని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఓ పుస్తకం కూడా రాశారు.