సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో సుధీర్ బాబు. మొదటి సినిమా ‘ఎస్ఏంఎస్’కే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండో సినిమా ‘ప్రేమ కధా చిత్రమ్’ తో కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు. తర్వాత ఒకొక్కమెట్టు ఎక్కుతూ అటు బాలీవుడ్ లో కూడా మంచి నటుడిగా గుర్తింపుపొందాడు. అటు యాక్షన్ ఇటు డీసెంట్ సినిమాలని బ్యాలన్స్ చేస్తూ సాగుతున్న సుధీర్ బాబు సినీ జర్నీకి పదేళ్ళు. ఈ సందర్భంగా తన పదేళ్ళ ప్రయాణం సంగతులని ముచ్చటించారు.
పదేళ్ళ సినీ ప్రయాణం ఎలా అనిపించింది ?
నాకే ఒక వండర్ లా వుంది. సినిమా ప్రయాణం మొదలుపెట్టినపుడు కొన్ని నియమాలు పెట్టుకున్నా. మన సినిమా గొప్పగా లేకపోయిన పర్లేదు కానీ గౌరవం తగ్గకూడదని అనుకున్నా. ఈ పదేళ్ళ ప్రయాణంలో గౌరవం పెరిగే సినిమాలే చేశా. ప్రతి సినిమాకి వందశాతం ఎఫర్ట్ పెట్టా. జయాపజయాలు మన చేతుల్లో లేవు. అయితే కొన్ని మంచి సినిమాలు చేశాననే తృప్తి వుంది.
ఈ పదేళ్ళ కెరీర్ లో ఈ సినిమా చేసిండుకూడదని ఎప్పుడైనా అనిపించిందా ?
ప్రతి సినిమా ఓ పాఠం. తప్పుల నుంచే నేర్చుకుంటాం. ఒక సినిమా ఆడలేదు అంటే ఎందుకు ఆడలేదని చెక్ చేసుకొని మరో సినిమాకి ఆ తప్పులు జరక్కుండా చూసుకుంటాం. ‘ఆడుమగాడ్ర బుజ్జి” సినిమా అనుకున్నట్లు ఆడలేదు. ఎక్కడ తప్పు జరిగుందో తెలుసుకున్నా. కథ బావున్న మాత్రాన సరిపోదు. ఆ కథని తెరపైకి తెచ్చే సత్తా టెక్నిషియన్స్ కు ఉందా లేదా? ఎలాంటి కథకు ఎంత బడ్జెట్ అవసరం ? ఇలాంటివన్నీ నేర్చుకున్నా. ఇక్కడ ప్రతి సినిమా ఎంతో కొంత నేర్పుతుంది.
కెరీర్ లో స్థిరపడిపోయారనే భావన కలిగిందా ?
స్థిరపడిపోవడమని వుండదు ఇక్కడ. ప్రతి సినిమా మొదటి సినిమాగా పని చేయాలి. ఈ సినిమా ఆడకపోతే మరో సినిమా రాదనే భయం, భాద్యతతోనే పని చేయాలి.
సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబులు నుంచి ఎలా ప్రేరణ పొందుతారు ?
సినిమాల విషయంలో కాదు ఫ్యామిలీ విషయంలో కూడా వాళ్ళు నుంచి చాలా నేర్చుకుంటా. కుటుంబానికి సమయం ఇవ్వాలి. అప్పుడప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో గడపాలి. సినిమాలని ఎంత సీరియస్ గా తీసుకోవాలో ఫ్యామిలీని కూడా అంతే సీరియస్ గా తీసుకోవాలి.
ఈ పదేళ్ళలో చెక్ లిస్టు ఎంతవరకు పూర్తయింది ?
చెక్ లిస్టు అంటూ ఏమీ లేదు. మంచి పాత్రలు చేయాలని వుంటుంది. భవిష్యత్ లో కూడా మంచి పాత్రలు చేయాలనీ వుంటుంది తప్పితే పర్టిక్యులర్ గా ఈ పాత్రలు చేయాలనీ ఏమీ లేదు.
డ్రీమ్ రోల్ ఏమీ లేదా ?
సినిమాలకి రాకముందు బ్యాట్మెంటెన్ ఆడాను. కుదిరితే ఒక స్పోర్ట్స్ సినిమా చేయాలనీ వుంది.
పుల్లెల గోపీచంద్ బయోపిక్ ఎక్కడివరకూ వచ్చింది ?
అది అనౌన్స్ చేసి చాలా రోజులైయింది. అయితే నిర్మాతల చేతులు మారడంతో ఆలస్యమైయింది. అయితే త్వరలోనే మొదలౌతుంది.
మీ సినిమా ప్రయాణం గురించి మహేష్, కృష్ణ తో చర్చిస్తుంటారా ?
ప్రత్యేకంగా చర్చ ఏమీ వుండదు. ప్రేమ కధా చిత్రమ్ చూసిన తర్వాతే మహేష్ చాలా కాన్ఫిడెన్స్ గా ఇంక తిరిగిచూసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. కృష్ణగారికి ‘శ్రీదేవి సోడా సెంటర్’ కూడా నచ్చింది. ‘మంచి సినిమా చేశావ్’ అన్నారు.
భవిష్యత్ లో ఎలాంటి సినిమాలు చేయాలనీ అనుకుంటున్నారు ?
ఇప్పటివరకూ యాక్షన్ సినిమాలు తక్కువ చేశాను. మొదటి సినిమా ఎస్ఏంఎస్ లో యాక్షన్ చేశాను. కానీ అది అంత రిజిస్టర్ కాలేదు. కారణం బడ్జెట్. యాక్షన్ చూపించాలంటే సరిపడా టెక్నిషియన్లు వుండాలి. సరైన ప్రమోషన్ చేయాలి. అప్పడే అది రీచ్ అవుతుంది. ఇప్పుడు అన్నీ కుదిరితే యాక్షన్ సినిమాలు చేయాలనీ వుంది.
హీరో, విలన్ రెండూ చేశారు ? ఏది కంఫర్ట్ అనిపించింది ?
నటుడు కావాలని నిర్ణయం తీసుకున్నపుడే హీరో కావాలనే వుంటుంది. నేను హీరో కావాలనే వచ్చాను. అయితే ఈ ప్రయాణంలో అర్ధమైన విషయం ఏమిటంటే.. నటుడిగా నిరూపించుకుంటేనే ఇక్కడ లాంగ్ కెరీర్ వుంటుంది. బాగీ చేయడానికి కూడా కారణం అదే. మంచి పాత్ర అది. నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. దీని తర్వాత బ్రహ్మాస్త్రలో కూడా విలన్ రోల్ ఆఫర్ చేశారు. అయితే ఇదే సమయంలో ఇంద్రగంటి సమ్మోహనం లాంటి సాఫ్ట్ కథతో వచ్చారు. బాగీ లో విలన్ తర్వాత సమ్మోహనం లాంటి క్లాస్ టచ్ వున్న సినిమా చేయడం బెటర్ అనిపించి సమ్మోహనం చేశా.
ఎలాంటి జోనర్ సినిమాలని ఇష్టపడతారు ?
యాక్షన్. నేను జాకీ చాన్ కి పెద్ద ఫ్యాన్.
మరి మీరెప్పుడు యాక్షన్ సినిమా చేస్తారు ?
త్వరలోనే. యాక్షన్ లో బెంచ్ మార్క్ లాంటి సినిమాలు చేయబోతున్నా.
నటుడు కావాలని ఎప్పుడు అనిపించింది ?
కృష్ణ గారి కుటంబం కావడం వలన చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి వుండేది. కానీ ఎప్పుడూ సీరియస్ గా ప్రయత్నించలేదు. ఒకసారి కృష్ణ వంశీ గారి సినిమా ఆడిషన్స్ కి వెళ్లాను. సెలెక్ట్ కాలేదు. యాక్టింగ్ నేర్చుకోమని సలహా ఇచ్చారు. తర్వాత నాన్న తో ప్రయాణం చేశా. అయితే ఒక దశలో కెరీర్ గురించి అలోచించడానికి చాలా సమయం దొరికింది. నాకంటూ ఒక గౌరవం గుర్తింపు తెచ్చుకోవాలనిపించింది. అప్పుడు నా కళ్ళముందు కనిపించింది సినిమా పరిశ్రమ. కృష్ణ, మహేష్ గారి నేపధ్యం వుందని కాదు. నేను వందశాతం కష్టపడగలని నమ్మకం. ఆ నమ్మకంతోనే పరిశ్రమకి వచ్చాను. సినిమా పరిశ్రమకి వచ్చిన ఇన్నేళ్ళలో ఒక్కరోజు కూడా కృష్ణ, మహేష్ దగ్గరికి వెళ్లి నాకు ఈ ప్రాజెక్ట్ చేసిపెట్టండని ఫేవర్ అడగలేదు. సినిమా రంగంలో అడుగుపెట్టినప్పుడే నా ప్రతిభ చూపించి నిలబడాలి తప్పితే మరోలా కాదని బలంగా నిర్ణయించుకొని వచ్చాను.
ఫ్యాన్స్ గురించి ఏం చెబుతారు ?
కృష్ణ, మహేష్ గారిపై వున్న అభిమానంతోనే కాకుండా నా వర్క్ ఇష్టపడి గౌరవం ఇస్తున్నారని నాకర్ధమైయింది. నా పనిని ఇష్టపడే నన్ను అభిమానిస్తారు.
మహేష్ సినిమాలో విలన్ రోల్ వస్తే చేస్తారా ?
ఇద్దరం ఒకే ఫ్రేమ్ లో కనిపించడం నాకూ ఆనందమే. అయితే మంచి రోల్ రావాలి. గుర్తిండిపోయే పాత్ర చేయాలి. ముందు కథ కుదరాలి.
పాన్ ఇండియా సినిమా ఆలోచన వుందా ?
చేయాలనీ వుంది. అయితే దాని కోసం ఇక్కడ సినిమాలు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. మన సినిమాలే పాన్ ఇండియా వెళ్తున్నాయి. ఇక్కడే ఎదిగే అవకాశం వుంది. మంచి ప్రాజెక్ట్ కుదిరితే అదే పాన్ ఇండియా సినిమా.
మీ డ్రీమ్ డైరెక్టర్ ?
నాకు అందరితోనూ వర్క్ చేయాలనీ వుంటుంది. పెద్ద దర్శకులతో పని చేస్తే నా కెరీర్ కి హెల్ప్ అవుతుంది. అయితే కొత్త దర్శకులతో పనిచేయడం మాత్రం ఆనందం ఇస్తుంది. వాళ్ళు మనల్ని చాలా గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళ నుంచి కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. కృష్ణ గారు కూడా ఇదే చెబుతుంటారు.
ఏ దర్శకుడితో పని చేయడం కష్టమనిపించింది ?
మారుతి గారు. ఆయన వర్కింగ్ స్టయిల్ చాలా డిఫరెంట్ గా వుంటుంది, స్పాట్ లో కొన్ని రాస్తారు. స్పాట్ లోనే దాన్ని నటించల్సివుంటుంది. కొంచెం ఎక్కువ ఎలర్ట్ గా వుండాలి.
మీ అబ్బాయిలకి సినిమాపై ఆసక్తి వుందా ?
వాళ్లకి నా కంటే ఎక్కువ ఇంట్రస్ట్. ఎలా ప్రోమోట్ చేయాలో నాకు చెప్తారు( నవ్వుతూ)
చైల్డ్ ఆర్టిస్ట్ గాచేస్తున్నారా ?
ఇద్దరూ బిజీ. హర్ష డైరెక్షన్ లో వస్తున్న నా సినిమాలో నా చిన్నప్పటి పాత్ర పెద్దోడు( చరిత్) చేస్తున్నాడు. మహేష్ సర్కారు వారి పాటలో చిన్నప్పటి మహేష్ గా చిన్నబ్బాయి( దర్శన్ ) చేస్తున్నాడు.
అల్ ది బెస్ట్ ..
థ్యాంక్ యూ..