సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గురువారం ఇండస్ట్రీ ప్రముఖులు చిరంజీవి నేతృత్వంలో సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే రెండు సార్లు మంత్రి పేర్ని సీఎం జగన్‌ను కలిసి వివరించారు. సినిమా టిక్కెట్ ధరలపై హైకోర్టు సూచనలతో ప్రభుత్వం నియమించిన కమిటీ పేర్ని నానికి నివేదిక సమర్పించారు. దాన్ని పేర్ని నాని సీఎం జగన్‌కు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
టికెట్ ధరలు పెంచాలని కమిటీ సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే మల్టీప్లెక్స్ టికెట్ల రేట్లలో పెద్దగా మార్పులు లేవు. కానీ మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామపంచాయతీల్లో ఉన్న థియేటర్లలో టికెట్ల రేట్లు మాత్రం పెంచాలని సూచించారు. ఏ ప్రాంతం అయినా సరే, నాన్ ఏసీ థియేటర్లు ఎక్కడున్నా సరే కనీస టికెట్ ధర రూ. 30 ఉండాలని సిఫారసు చేశారు. జీవో నెంబర్ 35 ప్రకారం అది కేవలం 5 రూపాయలే ఉంది. అంటే ఇప్పుడు కమిటీ రిపోర్ట్ ప్రకారం 25రూపాయలు అదనం అవ్వబోతోంది. అలాగే నాన్‌ఏసీల్లో గరిష్టంగా ఉన్న 15 రూపాయల టికెట్‌ను రూ. 70 కు రిపోర్ట్ ఇచ్చింది.
చిరంజీవి ఆధ్వర్యంలో సీఎం జగన్‌తో ఎవరెవరు భేటీ అవబోతున్నారన్న అంశంపై స్పష్టత లేదు. కానీ అగ్రహీరోలు పాల్గొంటారని చెబుతున్నారు. ఉదయం మీడియాతో మాట్లాడిన తమ్మారెడ్డి భరద్వాజ ప్రభుత్వం తరపున మాట్లాడేందుకు ఛాంబర్ ఉందని వ్యాఖ్యానించి కలకలం రేపారు. ప్రైవేట్ ఆన్ లైన్ టికెటింగ్ ప్రధాన సమస్య.. ప్రభుత్వం, ఛాంబర్ కలిసి అన్ లైన్ వ్యవస్ద పెట్టాలన్నది మా ఆలోచన అని వివరించారు. టిక్కెట్ రేట్ల తగ్గింపు సమంజసమేనన్నారు. తమ్మారెడ్డి వ్యాఖ్యలతో టాలీవుడ్లో ఏకాభిప్రాయం లేదన్న భావన ఏర్పడుతోంది. రేపు భేటీ తర్వాత మొత్తం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.