తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎంత బిజీగా ఉన్నా తన దృష్టికి వచ్చిన ఆపన్నులకు సాయం చేసే విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహించరు. అది కేవలం ఆస్పత్రులు, చికిత్సల అంశాల్లోనే కాదు యువతకు స్ఫూర్తినిచ్చే వారికి మరింత భరోసా కల్పించే విషయంలోనూ ఆయన స్టైల్ ప్రత్యేకం. ఇటీవల కేటీఆర్కు నల్లగొండ జిల్లాలో ఆటో నడుపుతున్న సబిత అనే యువతి విషయం తెలిసింది. ఇంటర్ రెండో ఏడాది చదువుతూ తండ్రి లేని కుటుంబాన్ని పోషించడానికి ఆటో నడుపుతోంది. ఆమె కథ ఎంతో స్ఫూర్తి కలిగిస్తోందని తెలుసుకున్న కేటీఆర్ భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఆమెను ప్రగతి భవన్కు ఆహ్వానించారు. సబిత కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెకి ఏం కావాలో తెలుసుకున్నారు. డబుల్ బెడ్ రూం ఇంటితో పాటు నూతన ఆటో రిక్షా కూడా అందించాలని కేటీఆర్ నిర్ణయించారు. అక్కడిక్కడ పత్రాలు అందించారు. భవిష్యత్తులోనూ ఆమెకు అండగా ఉంటామని తెలిపారు. మహిళలు తలచుకుంటే ఏదైనా చేయగలుగుతారని సబిత నిరూపించిందని కేటీఆర్ అభినందించారు.
సబితా తన కుటుంబానికి అండగా నిలిచిన తీరు యువతులకు ఖచ్చితంగా స్ఫూర్తిని ఇస్తుందన్నారు. మంత్రి కేటీఆర్ తన ప్రయత్నాలకు అండగా నిలవడం పట్ల సబిత సంతోషం వ్యక్తం చేశారు. ఎంత బిజీగా ఉన్నా కేటీఆర్ ఇలాంటి సాయాల విషయాలను మర్చిపోకపోవడం సమాజం పట్లఆయనకు ఉన్న నిబద్ధతగా చెప్పుకోవచ్చు.