పరిటాల రవి హత్య కేసులో నిందితులు ఎలా చనిపోయారన్నదానిపై ఇప్పటికీ ప్రజలు కథలు, కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ అధికారిక రికార్డులు మాత్రం చాలా క్లియర్‌గా ఉంటాయి. అప్రూవర్‌గా మారతానని కోర్టుకు చెప్పిన తర్వాత మొద్దు శీనును ఓం ప్రకాష్ అనే వ్యక్తి సిమెంట్ డంబెల్‌తో కొట్టి చంపాడు. బ్యారెక్‌లోకి సిమెంట్ డంబెల్ ఎలా వచ్చింది ? వేరే బ్యారెక్‌లో ఉండాల్సిన ఓం ప్రకాష్ మొద్దు శీను సెల్‌లోకి ఎలా వచ్చాడు ? అప్పటి అనంతపురం జైలు సూపరింటెండెంట్ ఎందుకు సెలవు పెట్టారు ? ఆ స్థానంలో ఇంచార్జ్‌గా ఉన్న జైలు ఉన్నతాధికారి ఓంప్రకాష్‌ను ఎందుకు మొద్దు శీను బ్యారెక్‌లోకి పంపారు ? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలుగానే ఉండిపోయాయి.
కడప సెంట్రల్ జైలు ఉన్నతాధికారిగా మొద్దు శీను హత్య సమయంలో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారి !
అయితే ఇప్పుడు కడప జిల్లా సెంట్రల్ జైల్లో ఇలాంటి ఘటనలు జరుగుతాయా అంటే .. మానవమాత్రులం చెప్పలేం కానీ.. కొన్ని జరిగిన వాటిని చెప్పుకోవచ్చు. ఒకటి జరిగిపోయింది. మొద్దు శీను హత్య జరిగినప్పుడు అనంతపురం జిల్లా జైలు సూపరింటెడెంట్ సెలవులో ఉన్నారు. ఆయన బాధ్యతలను ఇంచార్జ్‌గా పోచా వరుణారెడ్డి అనే అధికారి తీసుకున్నారు. అసలు సూపరింటెడెంట్ సెలవు నుంచి వచ్చే సరికి పనులన్నీ అయిపోయాయి. ఈ వరుణారెడ్డినే ఓం ప్రకాష్‌ను మొద్దు శీను బ్యారెక్‌లోకి పంపారు. అంతే కాదు చాలా తేడా పనులు చేశారని తేలడంతో ఆయనను అప్పట్లోనే సస్పెండ్ చేశారు. ఈ పోచా వరుణారెడ్డి ఇప్పుడు కడప జిల్లా సెంట్రల్ జైలుకు ఇంచార్జి సూపరిండెంట్‌గా నియమితులయ్యారు. మూడు రోజుల కిందట ఆయన జిల్లా కలెక్టర్‌ను కూడా కలిసి పరిణామాలపై చర్చించారు.
అర్హత లేదని ఇంచార్జిగా పదవి అప్పగింత !
నిజానికి వరుణారెడ్డికి కడప జిల్లా సెంట్రల్ జైలుకు సూపరింటెడెంట్గా నియమితులయ్యే అర్హత లేదు. ప్రస్తుతం ఆయన హోదా అడిషనల్ సూపరింటెడెంట్ మాత్రమే. నిబంధనల ప్రకారం సెంట్రల్ జైలుకు సూపరింటెడెంట్ స్థాయి అధికారి నియమితులు కావాలి. అందుకే ఇంచార్జి హోదాతో నియామకం చేపట్టారు. మొద్దు శీను జైల్లోనే హత్యకు గురైన సమయంలో ఆయనపై చాలా ఆరోపణలు వచ్చి.. సస్పెండ్ అయ్యారు. ఆయనపై మరో నిందితుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేస్తూ లేఖ కూడా రాశారు. తర్వాత ఈ పటోళ్ల కూడా హత్యకు గురయ్యాడు అది వేరే విషయం. అయితే సస్పెండ్ అయినప్పటికీ ఇప్పటి ప్రభుత్వం ఆయనకు ఇటీవల మెడల్ సిఫార్సు చేసింది. ఇప్పించింది.
ఏం జరుగుతుంది..? ఏం జరగబోతోంది ?
ఇప్పుడు పోచా వరుణారెడ్డిని కడప జిల్లా సెంట్రర్ జైలుకు అధికారిగా నియమించడంతో పాత ఘటనలన్నీ ఒక్క సారిగా చర్చనీయంశమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వివేకా హత్య కేసులో అరెస్టయిన కీలక నిందితులు అక్కడే ఉన్నారు . సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి లాంటి వారు అక్కడే ఉన్నారు. అందుకే ముందు ముందు చాలా కథలను వినాల్సి వస్తుందేమో అని … వరుణా రెడ్డి గురించి తెలిసిన వారు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు.