రీమేక్ సినిమాల్ని హిట్ చేయడం కత్తిమీద సాము. ఆ అంచనాల్ని భరించడం, దాటుకుని రావడం చాలా కష్టం. ముఖ్యంగా అయ్యప్పయునుమ్ కోషియమ్ లాంటి సినిమాల విషయంలో మరింత కష్టం. ఇందులో ఇద్దరు స్టార్లున్నారు. వాళ్లతో సినిమా నడపడమంటే మాటలు కాదు. `భీమ్లా నాయక్` విషయంలో మాత్రం లెక్కలు తప్పలేదు. అనుకున్నదానికంటే `భీమ్లా..` పెద్ద విజయమే సాధించింది. ప్రతి కూల పరిస్థితుల్ని ఈ సినిమా దాటుకుని వచ్చిన విధానం తప్పకుండా విస్మయపరిచేదే. అయితే ఈ భీమ్లా క్రెడిట్ ఎవరికి ఇవ్వాలన్నదే పెద్ద ప్రశ్న. ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకుడు. అయితే వెనుక నుంచి నడిపించిన శక్తి మాత్రం త్రివిక్రమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రాజెక్టు సెట్ చేయడానికి, పవన్‌కల్యాణ్‌ని ఇందులోకి తీసుకురావడానికి ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. స్క్రీన్ ప్లే, సంభాషణల్లో త్రివిక్రమ్ మార్క్ స్పష్టంగా కనిపించింది. ముందు నుంచీ ఈ సినిమా ‘త్రివిక్రమ్ సినిమా’గానే చలామణీ అవుతూ వచ్చింది. ఇప్పటికీ ‘ఆహా త్రివిక్రమ్’ అంటున్నారే తప్ప, సాగర్ చంద్రని ఎవరూ గుర్తు చేసుకోవడం లేదు.
నిజానికి సాగర్ చంద్ర ఈ స్క్రిప్టు విషయంలో చాలా కష్టపడ్డాడు. రెండు మూడు వెర్షన్లు రాశాడు. త్రివిక్రమ్ వచ్చాక… వాటికి రిపేర్లు జరిగాయి. కొత్త సీన్లు, ఎమోషన్లు వచ్చి కలిశాయి. మాటలు సరే సరి. ఈ కథకు సాగర్ ఏం చేశాడన్నది త్రివిక్రమ్‌కి తెలుసు. అందుకే భీమ్లా క్రెడిట్ ఆయనకే ఇచ్చాడు త్రివిక్రమ్. ఈ కథని అర్థం చేసుకుని, దాన్ని పవన్ స్టైల్ కి అనుగుణంగా తీర్చిదిద్దడానికి చాలా కష్టపడ్డాడని ‘థ్యాంక్యూ మీట్’లో త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తాను మాట్లాడకపోవడానికి కారణం… సాగర్ చంద్రకి స్పేస్ ఇచ్చి, ఎలివేట్ చేయడానికే అన్నది త్రివిక్రమ్ మాట. ఓ రకంగా.. ‘ఇది సాగర్ చంద్ర సినిమా’ అని ప్రమోట్ చేయడానికి త్రివిక్రమ్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడని చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ సమయంలో సాగర్ చంద్రని పక్కన పెట్టేశాడని, సెట్లో త్రివిక్రమ్ హవానే నడిచిందని, ఈ విషయంలో సాగర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని ముందు నుంచీ చెవులు కొరుక్కుంటూనే ఉన్నారంతా. పూర్తిగా కాకపోయినా, అది వాస్తవం కూడా. ఎందుకంటే.. ఈ సినిమా రిజల్ట్ అటూ ఇటూ అయితే, అభిమానులు ముందుగా టార్గెట్ చేసేది త్రివిక్రమ్‌నే. అజ్ఞాత వాసి ఫ్లాప్ అవ్వడం దగ్గర్నుంచి త్రివిక్రమ్ పై పవన్ ఫ్యాన్స్ చాలా గుర్రుగా ఉన్నారు. వాళ్లకో హిట్ ఇచ్చి, సంతృప్తి పరచడం త్రివిక్రమ్ బాధ్యతగా మారిపోయింది. అందుకే భీమ్లా విషయంలో త్రివిక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సివచ్చింది. సాగర్ చంద్ర ఉన్నా, తాను జోక్యం చేసుకోవడం వెనుక అసలు కారణం ఇదే. సినిమా పూర్తయ్యింది. లక్ష్యం నెరవేరింది. అందుకే ఇప్పటి వరకూ తెర వెనుకే ఉన్న సాగర్ చంద్రని కాస్త ముందుకు తీసుకొచ్చేందుకు తపిస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాతో త్రివిక్రమ్ కి కొత్తగా ఒరిగేదేం లేదు. కాకపోతే సాగర్ చంద్ర లాంటి అప్ కమింగ్ డైరెక్టర్లకు ఈ హిట్ తో మరిన్ని అవకాశాలు వస్తాయి. అందుకే త్రివిక్రమ్ తన వంతు ప్రయత్నం తాను చేస్తున్నాడు.