వంగవీటి రాధా పేరును కృష్ణా జిల్లాకు పెట్టాలని వస్తున్న డిమాండ్లపై ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ భిన్నంగా స్పందించారు. విజయవాడ జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని బ్రతిమలాడే ప్రసక్తే లేదని రంగా తనయుడు మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. రంగా శిష్యులుగా చెప్పుకొని పదవులు అనుభవించిన వారు, రంగా పేరు పెట్టేందుకు బాధ్యత తీసుకోరా అని ఆయన ప్రశ్నించారు. వంగవీటి రంగా కీర్తి అనంత మని, శాశ్వతమని రాధాకృష్ణ వ్యాఖ్యానించారు.
ఓ జిల్లాకు పేరు పెట్టినంత మాత్రాన ఆయనకు కొత్తగా వచ్చే పేరు ప్రఖ్యాతులేమీ లేవని స్పష్టం చేశారు. ఇటీవల వంగవీటి రంగా విగ్రహాలను పలు చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఏర్పాటు చేసిన ఓ విగ్రహాన్ని వంగవీటి ప్రారంభించారు. కులమతాలకు రాజకీయాలకు ప్రాంతాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల్లో రంగా విగ్రహాలు నలుమూలల ఉన్నాయన్నారు. తనకు రంగా తనయునిగా లభించే గౌరవం కన్నా మరే పదవి ఎక్కువ కాదన్నారు.
కొంత మంది టీడీపీ నేతలు వంగవీటి రంగా పేరును జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాధాకృష్ణ స్పందన ఆశ్చర్యకరంగా మారింది. ఆత్మగౌరవంగా సమాధానం ఇచ్చారని.. జిల్లాకు రంగా పేరు పెట్టాలని బతిమాలుకుని పెట్టించుకున్నంత మాత్రాన ప్రత్యేకంగా ఆయనకు వచ్చే గౌరవం ఏముంటుందని రాధా అనుచరులు ప్రశ్నిస్తున్నారు.