పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ టీం ఐ ప్యాక్ తెలంగాణలో సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాల విశ్లేషణ కోసమే ప్రశాంత్ కిషోర్ రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో ముఖ్యంగా కేసీఆర్ ఆతిధ్యంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల పాటు కేసీఆర్‌తో జరిగిన సమావేశాల్లో ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు. రెండో రోజు సాయంత్రం కేటీఆర్ కూడా వీరి సమావేశాలకు హాజరయ్యారు. ప్రధానంగా కేసీఆర్‌తో జాతీయ రాజకీయ సమీకరణాలపై చర్చలు జరిపినా.. రెండో రోజు పూర్తిగా తెలంగాణలో పీకే టీం జరిపిన సర్వే విశ్లేషణ కోసం సమయం కేటాయించినట్లుగా తెలుస్తోంది.
ఆరు నెలల కిందట ప్రశాంత్ కిషోర్‌ను టీఆర్ఎస్తో పని చేయడానికి ఒప్పించారు కేసీఆర్. ఆ తర్వాత ఓ సారి ప్రగతి భవన్‌తో ఆయనతో సమావేశమయ్యారని ప్రచారం జరిగింది. అది జరిగిన కొద్ది రోజులకే ఐ ప్యాక్ టీం రంగంలోకి దిగింది. ఇటీవల తెలంగాణలో కొంత మందిని నియమించుకోవడానికి పేపర్ ప్రకటన కూడా ఐ ప్యాక్ ఇచ్చింది. ఈ తరుణంలో ఐ ప్యాక్ టీం తరపున ఇప్పటికే సర్వే పూర్తి చేశారని తెలుస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఎంత ఉంది ? దానికి కారణాలేమిటన్నదానిపై చర్చలు జరిపినట్లుగ తెలుస్తోంది. భవిష్యత్‌లో చేపట్టాల్సిన వ్యూహాలపైనా పీకే దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది.
కేసీఆర్ జాతీయ ాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ముందుగా రాష్ట్రంలో పట్టు జారకుండా చూసుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. కేసీఆర్ ఇంకా ఓ ఆరు నెలలు ముందే వెళ్లాలనుకుంటున్నారు. అందుకే ముందుగా పీకే సేవలు ఎక్కువగా తెలంగాణలోనే ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫామ్‌హౌస్‌లో రెండు రోజుల పాటు జరిగిన చర్చల్లో దీనికి సంబంధించిన దిశానిర్దేశం పూర్తయిందని తెలుస్తోంది. మొత్తంగా పీకే జాతీయ రాజకీయాల కన్నా ముందుగా టీఆర్ఎస్ను అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కించడంపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి.