హీరోకి ఓ లోపం ఉండడం.. దాని చుట్టూ కామెడీతో కూడిన సన్నివేశాలు నడిపించేయడం.. ఈమధ్య ఇదో ట్రెండ్ గా మారింది. `సెబాస్టియన్` కథ కూడా అదే. కిరణ్ అబ్బవరపు హీరోగా నటించిన సినిమా ఇది. మార్చి 4న విడుదల అవుతోంది. కోమలి ప్రసాద్ కథానాయికగా నటించింది. బాలాజీ దర్శకుడు. ఈరోజు ట్రైలర్ విడుదల చేశారు.
రేచీకటి కానిస్టేబుల్ కథ ఇది. తనకు రేచీకటి ఉందన్న నిజాన్ని దాచి పెట్టి ఉద్యోగం సంపాదిస్తాడు. ఇప్పటి వరకూ మానేజ్ చేశాం కదా, ఏదోలా ఉద్యోగాన్ని కూడా మానేజ్ చేసేద్దాం అనుకుంటాడు. కొన్ని రోజులు బాగానే సాగుతుంది. చివరికి తన రేచీకటి కారణంగా ఓ కుటుంబానికి తీవ్ర నష్టం జరుగుతుంది. దాంతో సస్పెండ్ కూడా అవుతాడు. `ఉద్యోగం గొప్పదా న్యాయం గొప్పదా` అనే ప్రశ్న తలెత్తినప్పుడు న్యాయం వైపు అడుగులేస్తాడు హీరో. ఆ తరవాత ఏమైందన్నది కథ. రాజా వారు -రాణీగారు,ఎస్.ఆర్ కల్యాణ మండపం సినిమాలతో హిట్లు కొట్టాడు కిరణ్. తన కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఈసినిమాలోనూ కామెడీకి పెద్ద పీట వేసినప్పటికీ, దాంతో పాటుగా యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలకూ చోటు ఇచ్చినట్టు తెలుస్తోంది. సెకండాఫ్ థ్రిల్లింగ్ గా మలిచినట్టు అర్థమవుతోంది. కొన్ని డైలాగులు ఫన్నీగా ఉంటే, ఇంకొన్ని ఎమోషనల్ టచ్ తో సాగాయి. మొత్తానికి టికెట్ తెగ్గొట్టి,చూడదగ్గ సినిమాలానే అనిపిస్తోంంది. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.