వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై దర్యాప్తు చేయించాలని ఆయన కుమార్తె వైఎస్ సునీత .. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. లేఖతో పాటు సీబీఐకి తాను ఇచ్చిన వాంగ్మూలం వివరాలను కూడా ఇచ్చారు. ఈ కేసులో ఇతర సాక్షులు, అనుమానితులు ఇచ్చిన వాంగ్మలాలను కూడా సునీత జత చేశారు . ఇప్పటికే అవినాష్ రెడ్డి ఈ కేసులో పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయారు. సీబీఐకి వాంగ్మలం ఇస్తున్న ప్రతి ఒక్కరూ అవినాష్ రెడ్డి ఆయన కుటుంబం వైపే వేళ్లు చూపిస్తున్నారు.
అయితే అవినాష్ రెడ్డిని కాపాడేందుకు హత్యను వివేకా కుమార్తె, అల్లుడే చేయించారన్న ప్రత్యారోపణలను కొంత మంది చేస్తున్నారు. వైఎస్ జగన్‌కు చెందిన పత్రికలో దీనికి సంబంధించి విస్తృతమైన కథనాలు వస్తున్నాయి. మరో వైపు సీబీఐ అధికారులపైనా కేసులు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీబీఐ ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ బలమైన సాక్ష్యాలు… ఉన్నప్పటికీ ఇంతవరకూ సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డి జోలికి వెళ్లలేదు.
ఈ క్రమంలో వైఎస్ సునీతా రెడ్డి స్పీకర్‌కు లేఖ రాయడం కలకలం రేపుతోంది. సీబీఐ విచారణ జరుపుతున్నందున స్పీకర్ జోక్యం చేసుకునే అవకాశం ఉండదని భావిస్తున్నారు. అదే సమయంలో లోక్‌సభ స్పీకర్ ఈ విషయంలో ప్రత్యేకగా తీసుకునే చర్యలు ఏమీ ఉండకపోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. కానీ ఓ లోక్‌సభ ఎంపీ విషయంలో ఉన్న తీవ్రమైన అభియోగాలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లడం సముచితమని వైఎస్ సునీత భావించినట్లుగా తెలుస్తోంది.