తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు కానీ మంగళవారంరోజు ఎవరితోనూ భేటీ కాలేదు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశం అవుతారన్న ప్రచారం జరిగినప్పటికీ ఎలాంటి భేటీ జరగలేదు. కేసీఆర్ అధికారికంగా ఎవరితోనూ సమావేశం కాలేదు.కానీ కొంత మందితో సీక్రెట్ భేటీలు నిర్వహించారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నాలుగో తేదీ వరకూ ఢిల్లీలో ఉంటారని ఆ రోజు వారణాశిలో సమాజ్ వాదీ పార్టీకి మద్దతుగాప్రచారం చేస్తారని భావిస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీ టూర్‌కు ఎందుకు వచ్చారోఎవరికీ స్పష్టత లేదు. కేజ్రీవాల్‌ను మాత్రం కలుస్తారని చెప్పుకున్నారు.
ఇప్పుడు ఆయనతో కూడా భేటీ లేదు. అలాగే పలు పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన నిపు ణులు, మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతోనూ కేసీఆర్ వరుస భేటీలు జరుపుతారని కూడా టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. కానీ అలాంటి భేటీలు ఏమీ జరగడం లేదు. వారణాసి లోక్‌సభ స్థానం పరిధిలో ఈ నెల 7న ఏడో విడత యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 4వ తేదీన అక్కడ ఎన్నికల ప్రచారానికి కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ నేత శరద్ పవార్ తదితరులు వెళ్లే అవకాశాలున్నాయి. వీరితో పాటు కేసీఆర్ కూడా వారణాసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని భావిస్తున్నారు.
యూపీలో టీఆర్ఎస్ ప్రచారం ఉంటుందని కేటీఆర్ గతంలో ప్రకటించారు. అయితే ఎవరూ వెళ్లలేదు. ఇతర పార్టీల నేతలతో కలిసి కేసీఆర్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కేసీఆర్‌కు ప్రాంతీయ పార్టీల నేతలందరూ పాల్గొనే సభకు ఆహ్వానం అందకపోయినా.. ఆయన వెళ్లకపోయినా జాతీయ రాజకీయాల్లో ఆయనను ఎవరూ నమ్మడం లేదన్న అభిప్రాయం ఏర్పడుతుంది.