ప్రభుత్వ ఉద్యోగం అంటే వైట్ కాలర్ జాబ్స్. రెండేళ్లు తక్కువ జీతానికే పని చేస్తే ఆ తర్వాత పర్మినెంట్ ఉద్యోగులైపోవచ్చని వారంతా ఆశపడ్డారు. బయట సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్ని సైతం వదిలేసుకుని ..పెద్ద పెద్ద చదువుల్ని కూడా పక్కన పెట్టి సచివాలయ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు వారందరినీ పర్మినెంట్ చేయలేక ప్రభుత్వం అనేక రకాల వేషాలు వేసి వారికి పొగపెట్టే ప్రయత్నం చేస్తోంది. సీఎం జగన్ చెప్పిన దాని ప్రకారం రెండేళ్లకు ప్రొబేషన్ ఖరారు చేసి వారిని పర్మినెంట్ ఉద్యోగాల్లోకి తీసుకోవాలి. కానీ అలా జరగలేదు. అందరికీ ప్రొబేషన్ ఇస్తే జీతాలివ్వలేమని కంగారు పడి.. జూన్ లో చేస్తామని హామీ ఇచ్చారు.
ఇప్పుడు జూన్‌లోపు అందరూ ఉద్యోగాల నుంచి వెళ్లిపోయేలా రకరకాల విన్యాసాలను ప్రభుత్వం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. సచివాలయ ఉద్యోగులపై ఇప్పుడు ఎక్కడా లేనంత ఒత్తిడి కనిపిస్తోంది. ఎంత తీవ్రమైన ఒత్తిడి అంటే… ప్రభుత్వ యంత్రాంగానికి ఎక్కడ ఏ అవసరం వచ్చినా సచివాలయ ఉద్యోగులే కనిపిస్తున్నారు. వారికే డ్యూటీలు వేస్తున్నారు. వారి డ్యూటీ చార్ట్ వేరు కానీ..దాన్ని పట్టించుకోవడం లేదు. ఎంత దారుణం అయిపోయిందంటే చివరికి మరుగుదొడ్ల దగ్గర డబ్బుల కలెక్షన్లకు కూడా నియమించారు. అందులో మహిళా వార్డు కార్యదర్శులు ఉండటం మరింత దారుణం.
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తోందని సచివాలయ ఉద్యోగులు భావిస్తున్నారు. ఉద్యోగాలను పర్మినెంట్ చేయాల్సి వస్తుందనే సాకుతో ఇలా అవమానించి వెళ్లిపోయేలా చేస్తున్నారని భావిస్తున్నారు. ఇప్పప్పటికే రకరాకల పన్నలు వసూళ్లు.. డబ్బులకు సంబంధించిన వ్యవహారాల్లో సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఓటీఎస్ పథకం డబ్బుల వసూళ్లను కూడా వారికే టార్గెట్‌గా పెట్టారు. ఇలాంటి ఒత్తిళ్లతో సచివాలయ ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు. పర్మినెంట్ చేస్తారో లేదో కానీ ఈ లోపు వారిని మానసికంగా వేధించి ఉద్యోగం వదిలి వెళ్లిపోయేలా చేస్తున్నారన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది.