తెలంగాణ రాజకీయాలు వైల్డ్‌గా మారుతున్నాయి. ఇక్కడ తిట్లు, శాపనార్ధాలు, దాడుల స్థాయి దాటిపోయింది. చివరికి ఢిల్లీ చేరుకుంది. ఢిల్లీలోని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటి నుంచి నలుగురు వ్యక్తుల్ని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసినట్లుగా ఢిల్లీలోనే పోలీస్ కేసు నమోయింది. వారిని తీసుకెళ్తున్న సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అయితే వారిని తీసుకొచ్చింది తెలంగాణ పోలీసులేనన్న ప్రచారం జరుగుతోంది. వారిపై కేసులు ఉన్నాయని అక్కడున్నారని తెలిసి అరెస్ట్ చేసుకొచ్చారని చెబుతున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేదు.
అయితే ఈ మొత్తం వ్యవహారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ చుట్టూ తిరుగుతోంది. ఆయనపై అఫిడవిట్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సంఘం దర్యాప్తు జరుపుతోంది. ట్యాంపరింగ్ చేసినట్లుగా దాదాపుగా నిర్ధారణ అయిందని శ్రీనివాస్ గౌడ్‌పై అనర్హతా వేటు పడటమే తరువాయి అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ట్యాంపరింగ్ ఆరోపణలు చేసిన వ్యక్తులే కిడ్నాపయ్యారు. అందుకే ఇదంతా శ్రీనివాస్ గౌడ్ చేయించారని.. ఆరోపిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో అరెస్టు చేయించారని చెబుతున్నారు.
ఇప్పుడు ఢిల్లీలో కిడ్నాప్ కేసు నమోదయింది. ఎంపీ జితేందర్ రెడ్డి నివాసం హై సెక్యూరిటీ జోన్లో ఉంటుంది. అలాంటి చోట నుంచి తీసుకెళ్లాలంటే సీరియస్ ఇష్యూనే. పోలీసులు తీసుకెళ్తే రాజకీయంగా తీవ్రమైన విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే ఢిల్లీ వెళ్లి మరీ అరెస్ట్ చేస్తారా .. ఏదో రాజకీయం లేకపోతే అనే విమర్శలు వస్తాయి. ఒక వేళ పోలీసులు కాదంటే మాత్రం ఢిల్లీ కాప్స్ అంత తేలిగ్గా తీసుకోరు. ఇప్పుడీ కిడ్నాప్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కొత్త రచ్చకు కారణం అయ్యే అవకాశం ఉంది. పోలీసులే కిడ్నాప్ చేశారని బండి సంజయ్ రెండు రోజుల కిందటే ఆరోపించారు.