తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏదీ కలసి రావడం లేదు. కలసి రావడం లేదనుకోవడం కన్నా వాళ్లకు వాళ్లే కలసి రాకుండా చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డి ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. గతంలో నే ఆయన పాదయాత్ర షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నారు. ఆలంపూర్ నుంచి ప్రారంభించాలన ిఅనుకున్నారు. అయితే సొంత నిర్ణయం సాధ్యం కాదు కాబట్టి పార్టీ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు., రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో తన సన్నిహితులతో రేవంత్ పాదయాత్ర చేపట్టాలన్న ప్రతిపాదన పెట్టించారు. కానీ నిర్ణయం తీసుకోలేదు.
ఇప్పుడు కాంగ్రెస్‌లో తామంటే తాము పాదయాత్ర చేపడతామని పలువురు ముందుకు వస్తున్నారు. కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క సలహా పలువురు నేతలు తాము పాదయాత్ర చేస్తామని చెబుతున్నారు. అయితే టీపీసీసీ చీఫ్ ఈ పాదయాత్రను చేపడితేనే కార్యకర్తల్లో ఉత్సాహం, పార్టీలో కదలికా వస్తుందని లేకపోతే ఎవరు పట్టించుకుంటారని కొంత మంది వాదిస్తున్నారు. రేవంత్ ఒక్కరే పాదయాత్ర చేపడితే పార్టీ ఆ క్రెడిట్ అంతా ఆయన ఖాతాలోకి వెళ్లే అవకాశముందని కొంత మంది సీనియర్లు అడ్డు చక్రం వేస్తున్నారు.
ఒక్కరే కాకుండా అందరూ ఒక్కో సందర్భంలో పాదయాత్ర చేయాలని అప్పుడు క్రెడిట్ అందరి్కీ వస్తుందని అంటున్నారు. దీనిపై ఇంకా నిర్ణయం జరగలేదు. ఏకపక్షంగా పాదయాత్ర చేసే పరిస్థితి రేవంత్‌కు లేదు. తాను పాదయాత్ర చేసినా జనం బాగా వస్తారని చూపించేందుకు భట్టి విక్రమార్క ప్రస్తుతం తన నియోజకవర్గంలో శాంపిల్ పాదయాత్ర చేస్తున్నారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ పరిస్థితి మరింత గందరగోళంగా మారుతోంది.