తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ వ్యవస్థ మీద ఇప్పుడు ఓ రకంగా యుద్ధం ప్రకటించారు. గవర్నర్‌ను పూర్తి స్థాయిలో పట్టించుకోవడం మానేశారు. గణతంత్ర దినోత్సవాలు గవర్నర్ చేతుల మీదుగా జరగాల్సి ఉంటుందని వాటిని నిర్వహించలేదు. చివరికి గవర్నర్ రాజ్‌భవన్‌లో ఆ పని పూర్తి చేయాల్సి వచ్చింది. ఆమె పర్యటనలకూ సహకరించడం లేదు. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగమూ వద్దని డిసైడయ్యారు. దీనిపై అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే గవర్నర్ పై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారన్నది నిజం. ఎందుకిలా ?
గవర్నర్ వ్యవస్థపై కేసీఆర్ అసహనం !
బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఇటీవల గవర్నర్ వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు గవర్నర్లు అడ్డు పడుతున్నారు. ఓ సందర్భంగా మమతా బెనర్జీకి కేసీఆర్ సంఘిభావం తెలిపారు. ఆ తర్వాత ప్రెస్మీట్లో గవర్నర్ వ్యవస్థను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఈ వ్యవస్థపై చర్చ జరగాలన్నారు . అదే సందర్భంలో కొత్త రాజ్యాంగం గురించి ప్రస్తావించారు. తాను అనుకున్న రాజ్యాంగంలో గవర్నర్‌కు స్థానం లేదనుకున్నారేమో కానీ ఆతర్వాత నుంచి గవర్నర్‌ను రాజ్ భవన్‌ను పట్టించుకోవడం మానేశారు.
నరసింహన్‌లాంటి గవర్నర్లు ఉంటే ఓకేనా !?
తెలంగాణ సీఎం గవర్నర్ వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేయడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తుంది. ఎందుకంటే గత చరిత్ర భిన్నంగా ఉంది. ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా నరసింహన్ ఉన్న సమయంలో కేసీఆర్ ఆయనను ఉన్నత స్థానంలో నిలబెట్టారు. అవసరం ఉన్నా లేకపోయినా రాజ్ భవన్‌కు వెళ్లి కలిసేవారు. ఆయనను గరిష్ట స్థాయిలో కేసీఆర్ ఉపయోగించుకున్నారు. ఆయన ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గా కంటే తెలంగాణ గవర్నర్‌గా ప్రాచుర్యం పొందారు. వన్ సైడ్‌గా వ్యవహరిస్తూ ఏపీ ప్రభుత్వ విమర్శల పాలయ్యారు. అయినా ఆయనవెనక్కి తగ్గలేదు. చివరికి ఏపీకి తీవ్ర అన్యాయం జరిగినా ఆయన స్పందించలేదు. ఆయనే ఆ ఆన్యాయం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ ముందస్తుకు వెళ్లడానికి ఆయన ఎంత సహకరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చివరికి ఆయన బదిలీ అయి వెళ్లే సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. అంటే నరసింహన్‌లా సహకరిస్తే గవర్నర్ వ్యవస్థ మంచిదా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది.
గవర్నర్ వ్యవస్థలో కాదు లోపం.. రాజకీయంలోనే !
రాజ్యాంగంలో గవర్నర్ వ్యవస్థకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానికి పరిమితులు ఉన్నాయి.. దానికి తగ్గట్లుగా గవర్నర్లు ఉంటే ఎప్పుడూ సమస్య రాదు. కానీ రాజకీయం పూర్తిగా డామినేట్ చేస్తోంది. రాష్ట్రాలను ఇబ్బంది పెట్టాలని కేంద్రం గవర్నర్లను పావుగా వాడుకుంటోంది. వారు అధికార పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. దాంతో ఎన్నో సార్లు గవర్నర్ వ్యవస్థపై చర్చ జరిగింది. అదే సమయంలో గవర్నర్ వ్యవస్థను తీసేయాలని అంటున్నవారు తాము అధికారంలోకి వస్తే మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలన్నీ గవర్నర్ వ్యవస్థ ఉండొద్దనే కోరుకుంటాయి. కానీ రాష్ట్రాల్లో పట్టులేకపోయినా గవర్నర్ల ద్వారా పాలన చేయడానికి జాతీయ పార్టీలు ప్రయత్నిస్తాయి. అందుకే గవర్నర్ వ్యవస్థ ఎప్పుడూ వివాదాస్పదమవుతూనే ఉంది.
తమిళిశై కేసీఆర్ సర్కార్ పై కుట్ర చేస్తున్నారా !?
తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు వేర్వేరు గవర్నర్లను నియమించాలని డిసైడన తర్వాత తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళి శైను కేంద్రం నియమించింది. ఆమె వివాదాస్పదంగా వ్యవహరంచిన అంశాలు దాదాపుగా లేవు. బెంగాల్ గవర్నర్.. తమిళనాడు గవర్నర్ వ్యవహరించిన వాటితో పోలిస్తే కనీసం పదిశాతం కూడా ఆమె యాక్టివ్‌గా లేరు. కానీ చురుకైన రాజకీయ నేతగా ఉండి గవర్నర్‌గా వచ్చినందున కొన్ని పనులు చేయాలనుకున్నారు. అదే సీఎం కేసీఆర్ కు కోపం తెప్పించి ఉంటుందని భావిస్తున్నారు. లేకపోతే కేంద్రానికి ఏమైనా వ్యతిరేక నివేదికలు పంపి కుట్ర చేస్తున్నారని అనుమానిస్తూ ఉండవచ్చని భావిస్తున్నారు.