ఏపీ రాజధాని అమరావతి అని స్పష్టంగా పేర్కొంటూ కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారు. పట్టణాభివృద్ధి శాఖ కింద అమరావతికి నిధులు కేటాయిస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా అలాగే కేటాయించారు. బడ్జెట్ ప్రొవిజన్స్‌లో కూడా ఏపీ నూతన రాజధాని అమరావతి అనే పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని కోసం కేంద్రం ఆర్థిక సాయం చేయాల్సి ఉంది. సచివాలయం , ప్రభుత్వ ఉద్యోగుల గృహనిర్మాణాలు, ఏజీ స్టాఫ్ క్వార్టర్స్ ఇలా పలు నిర్మాణాల అంచనా వ్యయం.. వాటికి ఈ బడ్జెట్లో కేటాయింపులు కలిపి ఇచ్చారు.
గత రెండేళ్ల బడ్జెట్లోనూ నిధులు కేటాయించారు..కానీ చాలా స్వల్పంగా కేటాయించారు. ఇటీవల పార్లమెంట్లో కూడా ప్రస్తుతం ఏపీకి రాజధాని అమరావతినేనని కేంద్ర మంత్రి ప్రకటించారు. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుందని తెలిపారు. అలాగే గత ప్రభుత్వం అమరావతిలో పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు భూములు కేటాయించారు. ఆ భూముల్లో కొన్ని సంస్థలు నిర్మాణాలు ప్రారంభించలేదు.
ఇటీవల నిర్మాణాలు ప్రారంభించాయి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును మళ్లీ ప్రవేశపెడతామని ఏపీ మంత్రులు ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే హైకోర్టులో కేసు ఇంకా తేలలేదు. తీర్పు రిజర్వ్‌లో ఉంది. తీర్పు రాకుండా అసెంబ్లీలో చట్టం పెట్టలేరని చెబుతున్నారు. ఇప్పుడు కేంద్రం అమరావతికే ఫిక్స్ కావడంతో ఏపీ ప్రభుత్వం ధిక్కరిస్తుందా.. లేకపోతే సైలెంట్ అవుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.