చంద్రగిరిలో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు డీకేటీ పట్టా భూములు కలిగి ఉన్నారని తేలింది. వెంటనే ఈ అంశంపై దుమారం రేగింది. కానీ మోహన్ బాబు, మంచు విష్ణు స్పందించలేదు. దీనిపై వారు నేరుగా ఏపీ అధికారులతోనే సంప్రదించినట్లుగా కనిపిస్తోంది. మూడు రోజుల తర్వాత రామిరెడ్డి పల్లి అనే గ్రామానికి సంబంధించిన రికార్డులను పరిశీలించిన తహశీల్దార్.. అవి డీకేటీ భూములు కాదు పట్టా భూములేనని తేల్చారు. ఈ మేరకు మీడియాకు సమాచారం ఇచ్చారు. మరి రికార్డుల్లో డీకేటీ భూములని ఎందుకని ఉన్నాయంటే… ఆన్లైన్లో మార్చలేదని అందుకే సమస్య వచ్చిందని చెబుతున్నారు.
మంచు మోహన్ బాబు, విష్ణు వర్ధన్ లు ఆ భూములు కొనుగోలు చేశారని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అయితే కొనుగోలు చేయడానికి ముందు అవి డీకేటీ భూములు. అవి ప్రభుత్వ భూములు. గతంలో బడుగు, బలహీనవర్గాల వారికీ సాగు చేసుకోవడానికి ఇచ్చారు. తర్వాత వారు వాటిని అమ్ముకున్నారు. ఇలా పది మందికిపైగా చేతులు మారయట. ఆ తర్వాత మోహన్ బాబు కుటుంబం చేతికి వచ్చాయి. సాధారణంగా డీకేటీ భూములు అమ్మితే .. కొనుగోలు చేసిన వారికి పట్టాలివ్వరు.. ప్రభుత్వం స్వాధీనం చేసుకుని.. సెంట్ ఇళ్ల స్థలాల కింద పంపిణీ చేస్తుంది. గత రెండేళ్లుగా ఇలాంటి కొన్ని వేల ఎకరాల్ని స్వాధీనం చేసుకుంది.
కానీ మోహన్ బాబు కు మాత్రం పట్టాలు జారీ చేసినట్లుగా ప్రభుత్వ అధికారులు చెప్పారు. అవి పట్టా భూములుగా మారాయన్నారు. అంటే డీకేటీ భూములను క్రమబద్దీకరించి పట్టా భూములుగా మార్చారన్నమాట. మామూలుగా ఇలాంటి ఆరోపణలు ఏ అధికార పార్టీ నేత మీదనో వస్తే వెంటనే ఆ భూముల్లో ప్రభుత్వ భూమి అని బోర్డు ఉండేది కానీ మోహన్ బాబు ఫ్యామిలీ అదృష్టవంతులు కాబట్టి అధికారులే స్పందించి పట్టా భూమి అని క్లారిటీ ఇచ్చారు.