రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రైతులు దాఖలు చేసిన కొన్ని పిటిషన్ల విషయంలో విచారణ కొనసాగించాలని నిర్ణయించింది. అదే సమయంలో ప్రభుత్వం సీఆర్డీఏ చట్టం ప్రకారం వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయాలని.. మూడు నెలల్లో రైతులుక ప్లాట్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.
రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూములు కేటాయించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లకు కోర్టు ఖర్చుల కింద రూ. యాభై వేలు ఇవ్వాలని ఆదేశించింది. చట్టం ప్రకారం రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హైకోర్టు స్ప్టం చేసింది. కొందరు న్యాయమూర్తులు పిటిషన్లు విచారించవద్దంటూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టి వేసింది. రైతులు దాఖలు చేసిన ఇతర పిటిషన్లపై విచారణ కొనసాగించాలని నిర్ణయించింది.
హైకోర్టు తీర్పును బట్టి మూడు రాజధానుల బిల్లలను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలనుకున్న ప్రభుత్వానికి హైకోర్టు తీర్పుతో ఎదురు దెబ్బ తగిలినట్లయింది. మూడు రాజధానుల బిల్లును మరి ఏ రూపంలోనూ అసెంబ్లీలో పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతానికి పాత బిల్లులు అసెంబ్లీలో ఉపసంహరించుకున్నా దానికి సంబంధించిన వివాదాలు కోర్టులో ఉన్నట్లయింది. ఇప్పుడు ఆ బిల్లును మళ్లీ పెడితే అది కోర్టు ధిక్కారమే అయ్యే అవకాశం ఉంది.