అమరావతి విషయంలో సీఎం జగన్ ముందు ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క మార్గం మళ్లీ ప్రజా తీర్పు కోరడం. అధికారంలోకి రాక ముందు అమరావతిని రాజధానిగా సీఎం జగన్ అంగీకరించారు. అసెంబ్లీలో కూడా మద్దతు తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రచార సభల్లో అమరావతే రాజధాని అన్నారు. తీరా గెలిచిన తర్వాత బోస్టన్ కమిటీ అని.. బోత్స కమిటీ అని.. దక్షిణాఫ్రికా అనే దేశంలో మూడు రాజధానులు ఉన్నాయని విధానాన్ని మార్చేసుకున్నారు. ఇది ప్రజల్ని వంచించడమేనన్న విమర్శలు వచ్చాయి. రైతుల్ని మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. అయినా పట్టించుకోలేదు. ముందుకెళ్లారు. న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తగిలాయి. ఇప్పుడు ఎటూ మూడు రాజధానులపై ముందుకెళ్లలేని పరిస్థితి ఉంది.
మూడు రాజధానుల ఎజెండాగా ఎన్నికలకు వెళ్లాలి!
మూడు రాజధానులను నిర్ణయించినప్పుడు ఎన్నికలకు వెళ్లి ప్రజాభిప్రాయం తీసుకోవాలని ప్రతిపక్షాలు సవాల్ చేశాయి. కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు ఇదే అంశాన్ని ఎన్నికల ఎజెండాగా చేసుకుని వెళ్తే తమ నిర్ణయానికి ప్రజాభిప్రాయం ఉందని చెప్పుకోవచ్చు. న్యాయస్థానాల విషయంలో సీఎం జగన్ వైఖరి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మారుతుందని అనుకోవడానికిలేదు. అమరావతిని అభివృద్ధి చేయకపోయినా.. తమకు మళ్లీ అధికారం ఇస్తే మూడు రాజధానులు చేస్తామన్న అంశంతో ప్రజల్లోకి వెళ్లి అందరి ఆమోదం పొంది విజయం సాధిస్తే అప్పుడు సీఎం జగన్ అనుకున్నట్లుగా చేయవచ్చు.
ప్రజలు ఆమోదిస్తే రైతులకు నష్టపరిహారం చెల్లించి మూడు రాజధానులు !
మూడు రాజధానుల ఎజెండాతో గెలిచినంత మాత్రాన చట్ట పరంగా ఎలా సాధ్యమవుతుందన్న ఆలోచన కూడా రావొచ్చు. అయితే చట్టప్రకారం సాధ్యం కాదు అసెంబ్లీలో చట్టం చేసినా సాధ్యం కాదు.కానీ రైతులకు పరిహారం ఇవ్వడం ద్వారా మార్గం సుగమం చేసుకోవచ్ు.సీఆర్డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందంలో 9.14 ఫాంలోని 18వ షరతు ప్రకారం.. ప్రభుత్వం ఏ షరతునైనా ఉల్లంఘిస్తే 2013 చట్టం కింద పరిహారమివ్వాలి. రైతుల నుంచి సమీకరించిన 33వేల ఎకరాలకు నష్టపరిహారం చెల్లించి రాజధానులను ఏర్పాటు చేయవచ్చు.
ప్రజాభిప్రాయం కోరితే మాట తప్పారన్న అపవాదు కూడా పోతుంది !
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఓ రకంగా ఎన్నికల వేడి కనిపిస్తోంది. ప్రతిపక్షం ముందస్తు ఎన్నికలు వస్తాయని చెబుతోంది. వైఎస్ఆర్సీపీ హైకమాండ్ అదే ఆలోచనలో ఉన్నారని కూడా ఢిల్లీ స్థాయిలో మీడియాకు లీకులు వస్తున్నాయి. ఒక వేళ ముందస్తుకు వెళ్లే ఆలోచనలో ఉంటే ఏపీ ప్రభుత్వానికి ఇంతకు మించిన గొప్ప సమయం లభించదు. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తే .. పోయిన విశ్వసనీయతను కూడా రాబట్టుకునే అవకాశం ఉంటుంది.