Sebastian P.C. 524 Movie Review
Sebastian P.C. 524 Movie Review
క్రైమ్ అనేది యూనివర్సల్ కమర్షియల్ ఐటెమ్. క్లాసూ, మాసూ అనే తేడా ఉండదు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లు తీయడం రావాలే గానీ, అది మినిమం గ్యారెంటీ ఉన్న సబ్జెక్టు. ఈమధ్య ఓటీటీలు పెరిగాక, అందులో వెబ్ సిరీస్‌లు చూశాక… ఇన్వెస్టిగేషన్ థ్రిల్లరపై ప్రేమ, మక్కువ పెరిగాయి. దాంతో పాటు తెలుగులోనూ ఈ తరహా కథల ప్రవాహం చూసే అవకాశం దక్కింది. `సెబాస్టియన్` అలాంటి కథే. ఎస్.ఆర్. కల్యాణమండపంతో డీసెంట్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా ఇది. ట్రైలర్లు ఆసక్తిగా ఉండడం, ఈ హీరోపై కాస్తో కూస్తో నమ్మకం కలగడంతో… ఈ సినిమాపై ఓ లుక్కు వేసేలా చేశాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? సెబాస్టియన్ చేసిన ఇన్వెస్టిగేషన్ దేని కోసం..?
సెబాస్టియన్ (కిరణ్ అబ్బవరం)కి రే చీకటి. ఈ విషయాన్ని దాచి పెట్టి కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ ఉద్యోగమే ఎందుకు? అంటే.. అది తన నాన్న కల. అమ్మ ఆశ. అమ్మ (రోహిణి) ఇచ్చిన స్ఫూర్తితో కానిస్టేబుల్ అవుతాడు. అయితే… నైట్ ట్యూటీలో వైఫల్యం వల్ల చాలాసార్లు ట్రాన్స్ఫర్ అవుతూ.. అవుతూ చివరికి తన సొంత ఊరు మదన పల్లికి చేరుకుంటాడు. ఎస్.ఐ (శ్రీకాంత్ అయ్యంగార్) ని కాకా పట్టి కేవలం పగటి పూట షిఫ్టులే వేయించుకుంటాడు. తీరా ఓరోజు నైట్ డ్యూటీ చేయాల్సివస్తుంది. సెబాస్టియన్ ఖర్మ కాలి ఆ రోజే ఓ హత్య జరుగుతుంది. క్రైమ్‌సీన్‌లో ఎవిడెన్సులు ఎత్తుకుపోకుండా… కాపలా కాయాల్సిన బాధ్యత సెబాస్టియన్‌పై పడుతుంది. అది కూడా నైట్ షిఫ్ట్‌లో. సరిగ్గా అప్పుడే క్రైమ్ సీన్లోకి ముగ్గురు వ్యక్తులు .. ఒకరి తరవాత మరొకరు వచ్చి సాక్ష్యాధారాల్ని చెరిపేసే ప్రయత్నం చేస్తారు. నైట్ డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు సెబాస్టియన్ సస్పెండ్ అవుతాడు. మరోవైపు సరైన సాక్ష్యాలు లేని కారణంగా ఆ హత్యకేసుని న్యాయస్థానం కొట్టేస్తుంది. కాకపోతే తన వల్ల ఓ అమాయకురాలు చనిపోయిందన్న బాధతో రగిలిపోతాడు సెబాస్టియన్. ఆ క్రమంలో… ఆ రోజు రాత్రి క్రైమ్ సీన్లోకి వచ్చి, సాక్ష్యాలు చెరిపేసేందుకు చూసిన ఆ ముగ్గుర్నీ సెబాస్టియన్ ఎలా పట్టుకున్నాడు? ఆ ముగ్గురులో అసలు హంతకుడు ఎవరు? అనేదే మిగిలిన కథ.
సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే, రే చీకటి కానిస్టేబుల్ కథ ఇది. తన లోపం వల్ల ఓ అమాయకురాల్ని కాపాడలేకపోతాడు. ఓ హత్యని ఆపలేకపోతాడు. అయితే.. ఆ హత్య కేసులో న్యాయం చేయడానికి ఏం చేశాడు? అనేదే ఈ సినిమా. రేచీకటి ఉన్నవాడికి కానిస్టేబుల్ ఉద్యోగం ఎలా దక్కిందన్నది లాజిక్ లేనిదే. `ఆ నిజాన్ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి మేనేజ్ చేశారు…` అని దర్శకుడు కవర్ చేసుకున్నా, అసలు పాయింటే తేలిపోతుంది. సరే దాన్నీ వదిలేద్దాం. ఇదో క్రైమ్ కథ అని, ఓ వివాహితని చంపడానికి ముగ్గురు స్కెచ్చులు వేస్తున్నారని, ఆ ముగ్గురూ వీళ్లేనని ముందే రివీల్ చేసేశాడు దర్శకుడు. సెబాస్టియన్ నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు క్రైమ్ సీన్లోకి ఎంటర్ అయ్యేది కూడా వాళ్లే. కాబట్టి జనరల్ ఆ అనుమానం ఆ ముగ్గురి వైపే వెళ్తుంది. దర్శకుడు ఈ కథని అరటి పండు వలచి నోట్లో పెట్టేలా చెప్పాలనుకున్నాడు. కానీ కథలో చాలా ముఖ్యమైన ట్విస్ట్ అది. దాన్ని ముందే రివీల్ చేయడం వల్ల మజా పోయింది.
ఇంట్రవెల్ బ్యాంగ్ కాస్త సినిమాపై ఆసక్తి రేపుతుంది. `తెల్లారేలోగా మీ పని చెబుతా` అంటూ హీరో ఇచ్చిన బిల్డప్ ఆకట్టుకుంటుంది. అయితే… తెల్లారేక.. సినిమా చప్పున చల్లారిపోతుంది. కోర్టు ఆ కేసు కొట్టేయడం, రెండేళ్ల పాటు హీరో కాలక్షేపం చేయడం.. ఇవన్నీ విసుగు పుట్టించే సీన్లే. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు సన్నివేశాలు అలా సాగుతూ సాగుతూ ఉంటాయి. రోహిణి ఆత్మ రూపంలో మాటి మాటికీ వచ్చి కొడుక్కి హితబోధ చేయడం విసుగు తెప్పిస్తుంది. పోనీ, హీరోకి లవ్ స్టోరీ ఉందనుకుంటే – ఆ హీరోయిన్ ని కూడా తీసుకెళ్లి ముద్దాయిని చేసేశారు. దాంతో సినిమా అంతా సింగల్ ట్రాక్‌లోనే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
కేసుని ఎలా నరుక్కురావాలో తెలీక… హీరో సతమతమైపోతుంటే, నడి వీధిలో పేకాట రాయుళ్లు కనిపిస్తారు. `కనిపించని ముక్క మరోటి ఉంటుంది..` అనే సిగ్నల్ హీరోకి అందుతుంది. ఆ పాయింట్ నుంచి క్లూల్ని అన్వేషించే పనిలో దిగుతాడు హీరో. అయితే ఆ పేకాటేంటో? కనిపించని ముక్క అనే లాజిక్ పాయింట్ ఏమిటో? సగటు ప్రేక్షకుడికి ఏమాత్రం అర్థం కావు. అసలు ఇలాంటి కథలకు ఇన్వెస్టిగేషనే కీ పాయింట్. హీరోతో పాటు, ప్రేక్షకులూ ఆ ఇన్విస్టిగేషన్లో ఇన్వాల్వ్ అవ్వాలి. అప్పుడే ఇలాంటి కథలు పండుతాయి. కానీ అది ఈ సినిమాలో పండలేదు. హీరో చేసే ఇన్విస్టిగేషన్ ఏమిటో, బెంగళూరు వెళ్లి, వాడ్నెవడినో తన్ని, వాడి దగ్గర ఫొటో పట్టుకొచ్చి, హంతకుడ్ని పట్టుకోవడం ఏమిటో? కలుగులో దాగున్న ఎలకను పట్టుకోవడానికి రెండేళ్లు ఎదురు చూశాను అని చెప్పడం ఏమిటో? ఇవేం అర్థం కావు. ఫస్టాఫ్ లో కామెడీ మిక్స్ చేయడానికి కొంత స్కోప్ ఉంది. దాన్ని వాడుకోలేదు. సెకండాఫ్ లో కామెడీకే స్కోప్‌లేదు. అసలు విలన్ రివీల్ అయ్యాక.. ఆయనగారు చేసే సైకో నటన… వర్ణనాతీతంగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్టు అత్యంత చప్పగా ఉండడంతో, సెబాస్టియన్‌కి వెంటనే దండం పెట్టి, అట్నుంచి అటు అర్జెంటుగా పారిపోవాలనిపిస్తుంది.
తొలి రెండు సినిమాలలో కిరణ్ అబ్బవరం ఆకట్టుకున్నాడంటే దానికి కారణం.. అందులో తన కామెడీ టైమింగ్ అత్యంత సహజంగా ఉండడమే. ఆ బలాన్ని ఈ కథ కోసం వదులుకున్నాడు. తన మీస కట్టు బాగుంది. సీరియస్ లుక్‌లో, స్మైల్ లో యవ్వనపు రాజశేఖర్ కనిపించాడు. అయితే ఇది తనకు సూటయ్యే పాత్ర అయితే కాదు. రోహిణి ఎప్పటిలా తన అనుభవాన్ని రంగరించినా, ఆ పాత్ర మాటిమాటికీ ఆత్మలా రావడం సన్నివేశాన్ని మరింత లాగ్ చేయడానికే అనిపిస్తుంది. అసలు హీరోయిన్ కి ఈ సినిమాలో స్కోపే లేదు. శ్రీకాంత్ అయ్యంగార్.. కాస్త డీసెంట్ గా నటించాడు.
ఈ సినిమాలో ఉన్నవే రెండు పాటలు. అవేం పెద్దగా గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. కిరణ్ అబ్బవరం మాస్ హీరోగా చాలా త్వరగా ఎదిగేయాలనుకుంటున్నాడు. అందుకే అవసరానికి మించి ఎలివేషన్లు పడుతున్నాయి. సంభాషణలు మరీ డ్రమెటిక్ గా అనిపిస్తాయి. ఫస్టాఫ్ కాస్త కష్టంగానైనా చూడగలుగుతాం. కానీ సెకండాఫ్ మరీ… బేజారెత్తించేస్తుంది.
ఫినిషింగ్ టచ్: అంతా చీకటి
TELUGU360 Rating : 2/5