తెలంగాణలో బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ముగ్గురిలోనూ ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సమయంలో ముగ్గురు ఎమ్మెల్యేలతో బీజేపీ శాసనసభా పక్షం సమావేశం జరుగుతుందని ప్రకటించారు. కానీ కీలక భేటీకి ఎమ్మెల్యే రఘునందన్ రావు డుమ్మా కొట్టారు. దీంతో బీజేపీ నేతలు ఉలిక్కి పడి.. ఆయనకు అధికారిక కార్యక్రమాలు ఉన్నాయని అందుకే రాలేదని చెబుతున్నారు. కానీ శాసనసభాపక్షభేటీ కన్నా కీలకమైనదేమి ఉంటుందని కొంత మంది ప్రశ్నిస్తున్నారు.
అసలు విషయం రఘునందర్ రావు బీజేపీఎల్పీ నేతగా పదవి కోరుకుంటున్నారు. ప్రస్తుతం బీజేపీ ఎల్పీ నేతగా రాజాసింగ్ ఉన్నారు. ఆయనను మార్చాలని పట్టుబడుతున్నారు. తెలంగాణ బీజేపీకి ఉపఎన్నికల పుణ్యమా అని ఇద్దరు ఎమ్మెల్యేలు పెరిగారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీజేపీకి ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటు వచ్చింది. గోషామహల్ నుంచి రాజాసింగ్ విజయం సాధించారు. ఆ తర్వాత దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో రఘునందన్, ఈటల గెలిచారు. అయితే మొదటి నుంచి బీజేపీఎల్పీ నేతగా రాజాసింగ్ ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు. ఆయన కింద పని చేయడాన్ని రఘునందర్ రావు, ఈటల నామోషీగా ఫీలవుతున్నారు.
రాజాసింగ్‌ను ఫ్లోర్ లీడర్‌గా తప్పించాలంటే కేంద్ర నాయకుల అనుమతి తీసుకోవాలి. ఆయనను తప్పిస్తే రాజాసింగ్ అసంతృప్తికి గురవుతారు. అదే జరిగితే మరింత ఇబ్బందిక పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే ఇప్పుడల్లా ఏ నిర్ణయం వద్దని భావిస్తున్నారు. కానీ రఘునందన్ మాత్రం అసంతృప్తితో భేటీలకే డుమ్మా కొడుతున్నారు.