సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ కుమారుడికి ఇచ్చిన అదనపు అడ్వకేట్ జనరల్ పదవిని తీసేసినట్లుగా తెలుస్తోంది. ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించినట్లుగా తెలుస్తోంది. దీనికి కారణాలేమిటన్నదానిపై స్పష్టత లేదు. ఒకటి రెండురోజుల్లో బయటకు వస్తుంది. జాస్తి నాగభూషణ్ లాయర్. కానీ అంత పేరు ప్రఖ్యాతులు లేవు. అయితే వైసీపీ పెద్దలతో తండ్రికి సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఆయనను అదనపు అడ్వకేట్ జనరల్‌గా నియమించారు. ఆయనను ఆ పదవిలో నియమించే నాటికి ఏజీగా శ్రీరాం, ఏఏజీగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉన్నారు.
అయినప్పటికీ ఏ పోస్టు లేకపోయినప్పటికీ అదనపు అడ్వకేట్ జనరల్ అనే పదవిని సృష్టించి మరీ జాస్తి నాగభూషణంకు పదవి ఇచ్చారు. సీఎం జగన్ ఆయనకు మొదట్లో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. తన ఢిల్లీ పర్యటనల్లో ప్రత్యేక విమానాల్లో ఆయనను కూడా వెంటబెట్టుకుని వెళ్లేవారు. ముఖ్యమంత్రి నివాసంలోకి నేరుగా వెళ్లగలిగిన చనువు ఉండేది. అప్పట్లో న్యాయవ్యవస్థ మీద నిందలేసిన వ్యవహారంలో జాస్తి నాగభూషణం ప్రమేయంపైనా ఆరోపణలు వచ్చాయి. అయిదే ఆయనను పదవిలోకి తీసుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదన్న అభిప్రాయంతో ప్రభుత్వ వర్గాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
అందుకే ఆయనను సాగనంపాలని నిర్ణయించుకుని పొగ పెట్టారని చెబుతున్నారు . కొన్నాళ్లుగా ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. సీఎం ఇంటి గేట్లు కూడా మూసేశారు. చివరికి రాజీనామా చేసేయమని అడగడంతో అవమాన భారంతో రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఏదో లక్ష్యంతో ఆయనకు పదవి ఇచ్చారని అవి నెరవేరకపోవడంతో గెంటేశారన్న అభిప్రాయం ఉన్నత, న్యాయవర్గాల్లో వ్యక్తమవుతోంది.