భారత్లో రాజకీయ పార్టీలకు ప్రచార మాయలో పడి విచక్షణ లేకుండా పోతోంది. యుద్ధం బారిన పడి ఎలాగోలా ప్రాణాలు కాపాడుకుని తిరిగి వచ్చిన వారికి ఇండియాలో విచిత్రమైన పరస్థితులు కనిపిస్తున్నాయి. వారి మానసిక స్థితిని కూడా అంచనా వేయకుండా వారితో జేజేలు కొట్టించుకోవడానికి అధికార పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను తీసుకొస్తున్న విమానాలల్లోకి వెళ్లి వారికి స్వాగతం పలికేందుకు ప్రత్యేకంగా కేంద్రమంత్రులను నియంచారు. వారు వెళ్లి ఓసందేశం వినిపించి. . విద్యార్థులతో జై మోడీ అనిపించి… వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి.
అయితే ఉక్రెయిన్ నుంచి తిరిగి వస్తున్న వారందరూ జై మోడీ అనడం లేదు. తాము అక్కడ ఉండగానే రష్యాకు మద్దతుగా వ్యవహారించి తమ ప్రాణాల మీదకు మోడీ ముప్పు తెచ్చారని వారు ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో యుద్ధం ప్రారంభమయ్యే వరకూ కనీసం పట్టించుకోకపోవడంపైనా అసంతృప్తిగా ఉన్నారు. అందుకే ఎక్కువ మంది జై భారత్ అంటున్నారు కానీ.. జై మోడీ అనడం లేదు. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో జై మోడీ అని నినదించే వారి దృశ్యాలు కూడా ఎక్కువే కనిపిస్తున్నాయి. ఒక్క బీజేపీ కాదు.. ఉక్రెయిన్ ఇష్యూలో క్రెడిట్ కోసం ప్రాంతీయ పార్టీలూ పోటీ పడుతున్నాయి. టీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీలు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్ బాధితులతో ప్రచారం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
రాజకీయ పార్టీలకు ప్రచారం అవసరమే కానీ.. ఏమీ చేయకుండా చేశామని ప్రచారం చేయించుకోవడం దివాలా కోరు తనమే. ప్రభుత్వాలు తమ బాధ్యత తాము చేయాలి. ఆ బాధ్యత ను కూడా నిర్వర్తించి బలవంతంగా జై మోడీ కొట్టించుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది. కేంద్రం మరింత జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే అసలు ఉక్రెయిన్ లో విద్యార్థులకు ఈ సమస్య వచ్చేదే కాదు. ఇతర పార్టీలూ అంతే. భారత్లో రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకుంటే చాలు.. ప్రజలకు మంచి చేయకపోయినా పర్వాలేదనుకుంటున్నాయి. ఆ దుష్పలితమే ఇదంతా !