ఈనెల 11న రాధేశ్యామ్ విడుదల అవుతోంది. ప్రమోషన్లు ఇప్పటికే జోరందుకున్నాయి. గత వారం రోజుల నుంచీ రాధేశ్యామ్ ప్రమోషన్లు ఓ రేంజ్లో సాగుతున్నాయి. ఇప్పటికే చిత్రబృందం ముంబై, చెన్నై చుట్టొచ్చింది. మరో నాలుగైదు రోజుల్లో హైదరాబాద్ లోనూ ఓ ఈవెంట్ జరగబోతోంది.
రిలీజ్ తరవాత కూడా ఈ ప్రమోషన్లు ఇదే రేంజ్ లో సాగేలా చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ పై రాధే శ్యామ్ టీమ్ ఫోకస్ పెట్టింది. హిందీలో భారీ థియేటర్లలో ఈ సినిమా విడుదల అవనుంది. అయితే థియేటర్ల దగ్గర కూడా `రాధేశ్యామ్` ప్రమోషన్లు చేయాలని భావిస్తోంది. రాధే శ్యామ్ జ్యోతిష్యం చుట్టూ తిరిగే కథ. విధికీ – ప్రేమకీ మధ్య నడిచే డ్రామా. ప్రభాస్ హస్త సాముద్రిక నిపుణుడిగా కనిపించబోతున్నాడు. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్లు జరగబోతున్నాయి. రాధేశ్యామ్ ఆడుతున్న ధియేటర్ల దగ్గర.. జ్యోతిష్యుల్ని మోహరించబోతున్నార్ట. ఒక్కో థియేటర్ దగ్గర ఒక్కో జ్యోతిష్యుడ్ని నియమించి, అక్కడకు వచ్చే ప్రేక్షకుల జాతకం చెప్పేవిధంగా ఏర్పాటు చేస్తున్నార్ట. అందుకోసం దాదాపుగా 200మంది జ్యోతిష్యుల్ని ముంబై పంపించబోతున్నారని తెలుస్తోంది. వాళ్ల జీత భత్యాలు.. చిత్రబృందమే భరించబోతోంది. నిజానికి ఇది మంచి స్ట్రాటజీనే. కాకపోతే, రాధే శ్యామ్ కి ఎంత బజ్ రావాలో అంత బజ్ వచ్చేసింది. ప్రభాస్ సినిమా కోసం బాలీవుడ్ అంతా.. ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయినా కూడా.. పబ్లిసిటీ విషయంలో చిత్రబృందం రాజీ పడడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో, ఇక్కడి థియేటర్ల దగ్గరా ఇలాంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తారేమో చూడాలి.