బీజేపీ, కాంగ్రెస్‌లు లేకుండా కూటమి కట్టాలని కేసీఆర్ విస్తృతగా ప్రయత్నిస్తున్నారు. 2018 ముందస్తు ఎన్నికలకు ముందు ఎలా తిరిగారో ఇప్పుడు కూడా అలాగే ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు వెళ్లారు..మహారాష్ట్ర వెళ్లారు..జార్ఖండ్ వెళ్లారు.. పలువురు ప్రగతి భవన్‌కు వచ్చి కలిసి వెళ్లారు. అయితే అంతిమంగా ఫ్రంట్ పై ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదు. కాంగ్రెస్‌ను వదిలి పెట్టి వేరే ఫ్రంట్ ఆనే ఆలోచనే లేదని కేసీఆర్ కలిసి వెళ్లిన తర్వాతి రోజే డీఎంకే తేల్చి చెప్పింది. అచ్చంగా అంతే మహారాష్ట్ర వెళ్లి వచ్చిన తర్వాత శివసేన కూడా స్పష్టం చేశారు.
జార్ఖండ్‌లో అయితే ఒక్క రోజు కూడా టైం తీసుకోలేదు.. ప్రంట్ గురించి చెబుతున్నప్పుడే హేమంత్ సోరెన్ లేచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. ఈ పరిణామాలతో కేసీఆర్‌కు జాతీయ రాజకీయాల్లో ఎలాంటి సానుకూల సంకేతాలు లభించడం లేదని తెలుస్తోంది. ఎక్కడికి వెళ్లినా టీఆర్ఎస్ నేతలు అత్యుత్సాహంతో దేశ్ కీ నేతా అనే ఫ్లెక్సీలు పెడుతున్నారు కానీ.. ఆ దిశగా అడుగులేయడానికి అవసరమైన ప్రోత్సాహం మాత్రం కేసీఆర్‌కు లభించడం లేదు. జార్ఖండ్‌లో కేసీఆర్ ఫ్రంట్‌పై చేసిన వ్యాఖ్యలతో ఆయనలో పూర్తిగా నిరాశ ఏర్పడిందన్న వాదన కూడా వినిపిస్తోంది.
బీజేపీ మిత్రపక్షాలను కలవకుడా గతంలోలా కేవలం కాంగ్రెస్ మిత్రపక్షాలను కలుస్తూండటంతో ఆయనపై ఇతర పార్టీల్లో పూర్తి స్థాయిలో సానుకూలత ఏర్పడటం లేదు. మరో వైపు ఆయనను కలుపుకునేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. యూపీ ఎన్నికల్లో ఎస్పీకి మద్దతుగా ప్రచారం చేస్తామని సంకేతాలిచ్చినప్పటికీ కనీసం ఆహ్వానం కూడా రాలేదు. ఇటీవల స్టాలిన్ చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశానికీ ఆహ్వానించలేదు. దీంతో కేసీఆర్ ప్రయత్నాలు నిష్ఫలమవుతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అయితే కేసీఆర్ తన ప్రయత్నాలు ఆపలేరని.. సఫలం అయ్యే వరకూ కొనసాగిస్తారని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు కూడా కేసీఆర్ వెంట పిడికెడు మంది కూడా లేరని.. కానీ అంతిమ విజయం సాధించారని.. ఇప్పుడు కూడా అంతేనని టీఆర్ఎస్ వర్గాలు ధీమాగా ఉన్నాయి.