ఏపీ సీఎం జగన్ను ప్రధానమంత్రి మోడీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జగన్కు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటున్నారన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయినా ఎంతో సాయం చేశామని..ఇంకా చేస్తామని ఆర్థికమంత్రి బుగ్గనకు నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ మరియు నార్కొటిక్స్ అకాడమీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. కార్యక్రమం తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ట్రైనింగ్ సెంటర్ ను కరువు జిల్లా అయిన అనంతపురానికి కేటాయించడం ద్వారా కేంద్రానికి ఈ ప్రాంతం అంటే ప్రత్యేకమైన అభిమానమో తెలుసుకోవలన్నారు నిర్మలా సీతారామన్. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సెప్టెంబర్ నాటికి ఈ ఆకాడమీని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ అకాడమీ కోసం రైతుల నుంచి ఐదు వందల ఎకరాలు సేకరించారు. వారందరికీ నష్టపరిహారం ఇచ్చారు. అయితే ఇంకా ఇవ్వాలన్న డిమాండ్లు వస్తున్నాయని అలా ఇవ్వడం సాధ్యం కాదని వేదిక మీదనే స్పష్టం చేశారు.
నిర్మలా సీతారామన్ కార్యక్రమం జరిగిన తీరుపై వైసీపీ ఎంపీలు నిరనస వ్యక్తం చేశారు. నాసిన్ అకాడమీ శంకుస్థాపన కార్యక్రమం ఆహ్వాన జాబితాలో తన పేరు లేదని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో ఎంపీ రంగయ్య శంకుస్థాపనకు తనకు వాట్సాప్ లో ఆహ్వానం పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన దూరంగా ఉన్నారు. కేంద్రమంత్రి పర్యటనలో బీజేపీ నేతలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని వైసీపీ నేతలు మండిపడ్డారు.