వైసీపీలా తాము చేయబోమని టీడీపీ తేడా చూపించింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చివరి రెండేళ్లు అసెంబ్లీకి వెళ్లలేదు. జగన్ పాదయాత్ర చేస్తూండటంతో ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లకూడదని ఆదేశించారు. దానికి కారణంగా ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోలేదన్న కారణం చూపించారు. అయితే ఇప్పుడు టీడీపీకి కూడా అలాంటి కారణం చెప్పుకునే అవకాశం వచ్చినా అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకుంది.
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వదులుకోకూడదని టీడీపీ నిర్ణయించుకుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్సీ సమావేశంలో సభకు హాజరయ్యే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. సమావేశాలకు వెళ్లాలని కొందరు, వెళ్లవద్దని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే అందరి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఎంత దిగజారిపోయినా ఆ విషయాన్ని ప్రజల్లో పెట్టేందుకైనా సభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబును తీవ్ర అవమానానాల పాలు చేస్తూండటంతో ఆయన కంటనీరు పెట్టుకుని మళ్లీ సీఎంగానే వస్తానని చాలెంజ్ చేసి వెళ్లారు. దీంతో ఆయన మాత్రం సమావేశాలకు వెళ్లరు. ఈ సారి అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై చర్చ చేపట్టాలని వైసీపీ భావిస్తూండటంతో ఖచ్చితంగా వెళ్లాలని టీడీపీ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.