ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పే రవిజన్ కమిషన్ కోసం నియమించిన అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్టును ఎట్టకేలకు బయటపెట్టింది. అన్ని జీవోలు అర్థరాత్రి విడుదల చేస్తున్నట్లుగానే ఈ పీఆర్సీ రిపోర్టును రాత్రి పొద్దు పోయిన తర్వాత వెబ్సైట్లో పెట్టారు. ఈ పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇచ్చినా ఏం ప్రయోజనం లేదని నిర్ధారించుకున్నాక రిపోర్టును బయట పెట్టారు.
అశుతోష్ మిశ్రా కమిటీ ఉద్యోగులకు బీభత్సమైన ప్రయోజనాలేమీ సిఫార్సు చేయలేదు. ప్రభుత్వం అప్పటికే ఇస్తున్న 27శాతం ఫిట్‌మెంట్‌నే సిఫారసు చేసింది. అయితే కొన్ని అలవెన్స్‌ల విషయంలో పెంపును ప్రతిపాదించింది. ఎంత చేసినా ప్రభుత్వంపై ఏడాది మొత్తానికి పడే భారం రూ. మూడు వేల కోట్లు ఉంటుందని తేల్చింది. అంత తక్కువ మొత్తంలో సిఫారసులు ఉన్నప్పుడు ప్రభుత్వం ఆమోదించి ఉద్యోగుల మెప్పును పొందాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ఈ రిపోర్టును తుంగలో తొక్కి.. కొత్తగా ప్రధాన కార్యదర్శి కమిటీ వేసి.. కొత్త నివేదికతో కథ నడిపించారు.
సిఫారసు చేసిన దాని కన్నా.. తక్కువ ఫిట్ మెంట్ ఇచ్చి.. హెచ్‌ఆర్‌ఎలు తగ్గించి.. సీసీఏ రద్దు చేసి..క్వాంటమ్ పెన్షన్ తగ్గించేసి ఇలా ఉద్యోగుల ప్రయోజనాలన్నింటినీ తగ్గించేసి.. ప్రభుత్వం పై పీఆర్సీ వల్ల రూ. పదివేల కోట్ల భారం పడుతుందని సీఎం జగన్ చెప్పుకొచ్చేవారు. ప్రభుత్వం అదే వాదించేది. కానీ పడేది భారం కాదని మిగులు అని అశుతోష్ మిశ్రా కమిటీ లెక్కలతోనే తేలిపోయిది. ప్రభుత్వం దొంగ లెక్కలతో ఉద్యోగులను బురిడి కొట్టించిందని ఉద్యోగులు మథనపడే పరిస్థితి వచ్చింది.
అయితే ఇప్పటికీ ఆందోళన బాటలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలు మినహా మిగతా వారెవరూ నోరు విప్పే పరిస్థితి లేదు. ఉద్యోగసంఘాల నేతలు పూర్తిగా ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. అందుకే ఉద్యోగుల ప్రయోజనాలు అలా లెక్కలోకి లేకుండా పోతున్నాయి.