ఏపీ కేబినెట్లోని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ రాజ్యసభకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రేపోమాపో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో బొత్స సత్యనారాయణ స్థానం గల్లంతవడం ఖాయంగా కనిపిస్తోంది. సీనియార్టీతో సంబంధం లేకుండా మంత్రులందర్నీ తొలగించాలని నిర్ణయించడంతో ఆయన జాతీయ రాజకీయాలవైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. బొత్సకు రాజ్యసభ సీటివ్వడానికి జగన్ కూడా అంగీకరించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో చక్రం తిప్పుతున్నారు.
అన్ని చోట్లా ఆయన కుటుంబీకులే కీలకమైన పదవుల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మంత్రి పదవి పోతే పోటీ వర్గాలకు పదవి వస్తే ఆయన వర్గం ఇబ్బంది పడుతుంది. అలా కాకుండా ఉండాలంటే మరో కీలకమైన పదవిలో ఉండాలని బొత్స అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే రాజ్యసభ స్థానం వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కంటే జాతీయ రాజకీయాల్లో తన స్థానం సేఫ్‌గా ఉంటుందని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అయితే బొత్స సత్యనారాయణ భాషా సమస్య ఉంది. హింది, ఇంగ్లిష్ లాంటివి రావు. అయనకురాజ్యసభ ఇస్తే పార్లమెంట్లో ఏపీ వాయిస్‌ను ఎలా వినిపిస్తారన్నది కూడా ఆసక్తికరమే. అయితే పార్లమెంట్లో ఉన్న వైసీపీ ఎంపీలు అత్యధికం మాట్లాడటం లేదు. చాలా కొద్ది మంది మాత్రమే మాట్లాడుతున్నారు. వారిలో ఒకరిగా బొత్స ఉండే అవకాశం ఉంది. మొత్తంగా వైసీపీ తరపున రాజ్యసభ రేస్‌లో బొత్స ముందున్నట్లుగా తెలుస్తోంది.