హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడిరాష్ట్రం ఉన్నప్పుడు ఈ ప్రెస్ క్లబ్‌కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ప్రెస్ క్లబ్ ప్రాధాన్యం .. జర్నలిస్టుల మద్యం అవసరాలు తీర్చడానికే పరిమితం అవుతోంది. అయినప్పటికీ ఆ క్లబ్ ఎన్నికలు మాత్రం ఎప్పటికప్పుడు హైలెట్ అవుతూనే ఉన్నాయి. ప్రెస్ క్లబ్ సభ్యులందరూ జర్నలిస్టులే. ఎవరూ ఆగర్భ శ్రీమంతులు కాదు. జీతాల మీద ఆధారపడేవారే. అయితే తమ నైపుణ్యంతో కొంత మంది ఆర్థికంగా స్థిరపడి ఉండవచ్చు. వారిలో ఉత్సాహం ఉన్న వాళ్లు ఎన్నికల్లో పోటీచేస్తున్నారు.
ప్యానల్స్‌గా ఏర్పడ్డాయి.. ఇండిపెండెంట్‌గానూ పోటీ పడుతున్నారు. అయితే ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో కూడా ” ఎన్నికల వైపరీత్యం ” కనిపిస్తోంది. ఓటర్లకు మద్యం పంపిణీ చేయడం ..అలవి మాలిన హామీలు ఇవ్వడం వంటివి చేస్తున్నారు. పోటీ చేసేవారు ఒక్కొక్కరు పది లక్షల వరకూఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇంత ఖర్చు పెట్టడానికి జీతాల మీద ఆధారపడే జర్నలిస్టులకు డబ్బులెక్కవడినే మౌలిక ప్రశ్న అందరికీ వస్తుంది.దానికి ఎవరి దగ్గరా సమాధానం ఉండదు. ఇంతా చేసి గెలిచి న తర్వాత ఏం సాధిస్తారు అంటే చెప్పడానికి ఏమీ ఉండదు. ఓ పదవి అనే కిరీటం తప్ప.
కొసమెరుపేమిటంటే… ఈ ప్రెస్ క్లబ్లో అందరూ పాతతరం జర్నలిస్టులే. కొత్త వారిని గడప కూడా తొక్కనీయరు. కొత్త వారంటే పదిహేనేళ్ల కిందట జర్నలిస్టులు అయిన వారిని కూడా సభ్యులు కానివ్వరు.. సభ్యులు కావాలంటే ఎన్నో రూల్స్ ఉంటాయి. అందుకే ప్రెస్ క్లబ్లో అందరూ సీనియర్లే ఉంటారు. వారి గుప్పిట్లోనే ఉంటారు. పలుకుబడి పెంచుకోవడానికి ఈ పదవుల్ని అడ్డం పెట్టుకుంటారు కానీ జర్నలిస్టుల సంక్షేమానికి చేసేది శూన్యం. చివరికి ప్రెస్ క్లబ్ సభ్యులకు కూడా. అయినా ఎన్నికలంటే అదో హడావుడి. ఇప్పుడు అదే కనిపిస్తోంది.