తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయం చేయడం అంటే తమ పార్టీలో తాము రాజకీయం చేసుకోవడం.. ఒకరుపై ఒకరు విమర్శలు చేసుకోవడం అనుకుంటున్నారు. పార్టీ అధ్యక్షుడు మాట్లాడిన దానికి భిన్నంగ మాట్లాడటం క్రేజ్ అనుకుంటున్నట్లుగా ఉన్నారు. రాజకీయ వ్యూహాలు.. ఇతర ఆలోచనల్లాంటివేమీ పట్టించుకోకుండా మీడియాను పిలిచి.. చిట్ చాట్లు చేసి భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి తెలంగాణకు చెందిన సివిల్ సర్వీస్ అధికారులకు పెద్దగా ప్రాదాన్యం దక్కడం లేదని విమర్శలు చేశారు. అదే సమయంలో బీహార్ క్యాడర్ అధికారులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని .. వారంతా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శలు చేస్తున్నారు.
అయితే దీనిపై ఐపీఎస్‌ల సంఘం.. ఐఏఎస్‌ల సంఘాలు స్పందించాయి. అంటే ఈ ఇష్యూ వారిని కదిలించినట్లే. దీన్నే అందుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ అధికారుల కోసం మరింత జోరుగా మాట్లాడటం ప్రారంభించారు. ఆయనకు కొంత మంది తెలంగాణ సివిల్ సర్వీస్ అధికారుల సపోర్ట్ అంతర్గతంగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి.. తెలంగాణ ఆత్మగౌరవ సెంటిమెంట్‌ను పెంచుకోవాల్సిన కాంగ్రెస్ నేతలు… వెంటనే రివర్స్ గేరేశారు.
ముందు రేవంత్ ఎడ్డేమంటే తెడ్డేమనే వీహెచ్ రంగంలోకి దిగి .. బీహార్ అధికారుల్ని వెనకేసుకొచ్చి రేవంత్‌పై విమర్శలు చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న మధుయాష్కీ గౌడ్ తీసుకున్నారు. ఆయన మరింత వ్యూహాత్మకంగా మీడియాను పిలిచి.. చిట్ చాట్‌గా మాట్లాడి బీహార్ అధికారులు కూడా దేశంలో బాగమేనంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు. ఒక్క మధుయష్కీ యే కాదు.. చాలా మంది కాంగ్రెస్ నేతలది అదే పరిస్థితి. ప్రత్యర్థి ని బట్టి రాజకీయం చేయడంలో ఎప్పుడు విఫలమవుతారో.. అప్పుడే రాజకీయం ఫెయిలయినట్లు.. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు ముందుంటున్నారు.