తెలంగాణ సీఎం కేసీఆర్ బాహుబలి ఉద్యోగాల నోటిపికేషన్ ప్రకటించారు. 80, 039 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లుగా ప్రకటించారు. ఈ క్షణం నుంచే నోటిఫికేషన్ల జారీ ప్రారంభమవుతుందని ప్రకటించారు. దీంతో పాటు 11, 103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించబోతున్నారు. అంటే శాశ్వత ప్రాతిపదికన 91వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారన్నమాట. ఇకపై కాంట్రాక్ట్ పద్దతిలో నియామకాలు ఉండబోవని కేసీఆర్ ప్రకటించారు.
అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించారు. ఐదు శాతం ఓపెన్ కేటగిరి ఉంటుంది. సచివాలయం తప్ప అన్ని చోట్లా స్థానికత రిజర్వేషన్ ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు. గ్రూప్1 – 503, గ్రూపు 2: 582, గ్రూప్ 3:1373, గ్రూప్ 4: 9168, జిల్లా స్ధాయి లో 39829, జోనల్ స్థాయిలో 18866, మల్లీజోన్ లో 13170, ఇతర కేటగిరీల్లో 8174 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. క్రమబద్దీకరించేవి కాకుండా వీటి సంఖ్య 80039.
ఉద్యోగుల వయోపరిమితిని కూడా పెంచుతున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. ఓసీలు 44 ఏళ్ల వయసు ఉన్న వారూ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ 49 ఏళ్ల వరకూ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. వికలాంగులకు 54 ఏళ్లు ఉన్నప్పటికీ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ వన్, టు ఉద్యోగాలు మొదటి సారి భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాల నియామకాలకు సంబంధించి పూర్తి స్థాయి నోటిఫికేషన్ల వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయబోతున్నారని ముందుగానే టీఆర్ఎస్ శ్రేణులకు సందేశాలు అందాయి. ఆ ప్రకారం పెద్ద ఎత్తున ఉత్సవాలకు సన్నాహాలు చేసుకోవాలని కూడా సూచించారు. ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. కేసీఆర్ అలా అసెంబ్లీలో ప్రకటన చేయగానే ఇలా టీఆర్ఎస్ నేతలు… సంబరాలతో హోరెత్తించారు.