ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందని.. ఆయన ఏ వర్గాన్ని వదలకుండా నాశనం చేశారని తమకు ఎన్నికలు ఎప్పుడు జరిగినా 160 సీట్లు వస్తాయని టీడీపీనేతలు చెబుతున్నారు. దీనికి వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. కొత్తగా టీడీపీ నేతలు కూడా కౌంటర్లేస్తున్నారు. అయితే నేరుగా కాకుండా జగన్‌కు పాజిటివ్‌గా మాట్లాడటం ద్వారా తమ అభిప్రాయం చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో క్రేజ్ కాస్తంత తగ్గవచ్చుకానీ ఓడిపోయేంత కాదని హైదరాబాద్‌లోని అసెంబ్లీ భవనంలో ఉన్న సీఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తేల్చేశారు.
ఆయన అభిప్రాయం ప్రకారం ఇప్పటికీ జగన్ ఓడిపోయేంత వ్యతిరేకత లేదని అనుకోవాలి. అయితే ఆయన ఈ మాటలు అనంతపురం జిల్లాలో తమకు ప్రాధాన్యం లభించడం లేదనే కోపంతో అన్నట్లుగా భావిస్తున్నారు. జగన్ పై ఓడిపోయేంత వ్యతిరేకత లేదని చెప్పినప్పటికీ జగన్‌పై తన సహజశైలిలో ఎన్ని సెటైర్లు వేయాలో అన్నీ వేశారు. మహా, మహా మేధావులు కలిసి మూడు రాజధానులు పెట్టారన్నారు. ఒకటి కాదు పది రాజధానులు పెట్టుకోని.. అది ‘మా’ సీఎం జగన్ ఇష్టం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్ మూడు రాజధానులను వదిలేశారని.. అందుకే బొత్స హైదరాబాద్ మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయకుండా తన కుమారుడ్నిరంగంలోకి దింపిన జేసీ.. తర్వాత దాదాపుగా సైలెంటయ్యారు. అనంతపురం జిల్లాలో తాడిపత్రి మినహా ఇతర చోట్లా తాము చెప్పినట్లుగా చేయడం లేదని టీడీపీ హైకమాండ్‌పై అసంతృప్తితో ఉన్నారు.