ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు మీడియాలో పెద్దగా కవరేజీ రాదు. వచ్చే కవరేజీ కూడా ఆయన ఏ టాపిక్‌ను హైలెట్ చేసుకుని మాట్లాడతారో దానికి రావడం లేదు. అన్ని మీడియాలు.. తమ తమ ఎజెండాల ప్రకారం ఆయన వ్యాఖ్యలు హైలెట్ చేస్తున్నాయి. దాంతో ఆయనపై విమర్శలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సాక్షి పత్రికలో ఆయనకు వస్తున్న కవరేజీ ఆయనకు ఏ మాత్రం మేలు చేయకపోగా.. ఆయనకు జగన్ తొత్తు అనే విమర్శలు వచ్చేలా చేస్తోంది. సాక్షి ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తోందేమో అన్న అనుమానాలు బీజేపీ వర్గీయుల్లో కనిపిస్తున్నాయి.
సోము వీర్రాజు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఆయన టీడీపీని కూడా విమర్శిస్తారు. అదే సమయంలో వైసీపీని కూడా విమర్శిస్తారు. ఆయన మాటలను వైసీపీ వ్యతిరేక మీడియా లైట్ తీసుకుంటుంది. పెద్దగా కవరేజీ ఇవ్వదు. కానీ టీడీపీని విమర్శించే మాటలను వైసీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఇటీవల ఆయన ఐదేళ్లలో చంద్రబాబు రాజధాని కట్టలేదని విమర్శించారు. తాము వస్తే కట్టేస్తామన్నారు. వైసీపీ కూడా మూాడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేసిందని విమర్శించారు. వైసీపీ అనుకూల మీడియా.. సాక్షి లో కూడా…చంద్రబాబు రాజధాని కట్టలేదనే విమర్శలనే హైలెట్ చేసింది. ఆయన అదొక్కటే మాట్లాడారన్నట్లుగా ప్రచారం అయిపోయింది.
దీంతో సోము వీర్రాజు వైసీపీ వ్యక్తి.. జగన్ ఏం చెబితే అది చేస్తారన్నట్లుగా సోషల్ మీడియాలోప్రచారం ప్రారంభమయింది. మొదటి నుంచి ఆయనకు ప్రో వైసీపీ ముద్ర ఉంది. ఆయనను టీ బీజేపీ అధ్యక్షుడిగా చేయడం వల్ల అది పార్టీకి అంటుకుంది. ఫలితంగా బీజేపీకి ఎక్కడా లేనంత ఇబ్బందికర పరిస్థితి ఏపీలో ఉంది. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయని సోము వీర్రాజు… సాక్షి మీడియాకు చాన్సిస్తూ టీడీపీని విమర్శిస్తూనే ఉన్నారు. తనపై ప్రో వైసీపీ ముద్ర ఉంటేనే బెటరని ఆయన అనుకుంటున్నారని.. అందుకే ప్రో వైసీపీ మీడియా ఇంత అలుసు తీసుకుంటోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.