తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు ఈత కాయ ఇచ్చి… తాటికాయ ఇస్తానని ఆశ చూపించి.. ఓట్లు దండుకుంటారని.. తర్వాత మర్చిపోతారని ప్రజలు ఓ నమ్మకం ఉంది. 2015 గ్రేటర్ ఎన్నికల సమయంలో సనత్ నగర్ నియోజకవర్గంలో ఓ పదో..ఇరవయ్యో డబుల్ బెడ్ రూం ఇళ్లను చకచకా నిర్మించారు. వాటిని చూపించి ఆ గ్రేటర్ ఎన్నికల్లో గెలిచారు. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉపయోగించుకున్నారు. ఇప్పటికీ డబుల్ బెడ్ రూం ఇళ్లను కనీసం వెయ్యి మందికి కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత హైదరాబాద్‌లో వరద సాయం విషయంలోనూ అంతే చేశారు. చకచకా కొన్ని ఇళ్లకు తలా పదివేలు పంచి.. హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఆపేశారు.
చివరికి దళిత బంధు విషయంలోనూ అదే జరిగింది. హుజురాబాద్ ఎన్నికలకు ముందు ఆ నియోజకవర్గంలో వారికి దళిత బంధు ఇచ్చిన సీఎం కేసీఆర్ .. ఎన్నికలు ముగిసిన తర్వాత సైలెంటయ్యారు. నాలుగు మండలాల్లో వంద శాతం దళితులకు సాయం చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించడం లేదు. నియోజకవర్గానికి వందమందికి ఇస్తామని ప్రకటించారు. ఆ ప్రాసెస్ నడుస్తోంది.ఈ విషయంలోనూ కేసీఆర్‌కు రిమార్కులే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఉద్యోగాల భర్తీ కూడా ఇదే తరహాలో ఉంటుందా అన్న సందేహాలు సహజంగానే నిరుద్యోగుల్లో ఉన్నాయి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారన్న ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది.
ఒక వేళ అదే నిజం అయితే.. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి వెళ్లాల్సి ఉంటుంది. ఉద్యోగాల భర్తీకి ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. వివిధరకాల పిటిషన్లు హైకోర్టులో పడే అవకాశం ఉంది. అదే సమయంలో ఇతర సమస్యలూ వస్తాయి. అయితే అన్నింటినీ అధిగమించి.. ఉద్యోగాల భర్తీ చేయాల్సి ఉంది. సమస్యలు వచ్చినప్పుడు … ప్రక్రియ నిలిపివేసి..బీజేపీ, కాంగ్రెస్‌లు అడ్డుకున్నాయని ఎన్నికలకు వెళ్తే.. అదిటీఆర్ఎస్కు ఇబ్బందికరమే. ఇప్పుడు కేసీఆర్‌పై ఇలాంటి అనుమానాలే ఉన్నాయి. రాజకీయం చేస్తే మొదటికే మోసం వస్తుంది..మొత్తంగా తేడా వస్తుంది.