కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలతో తనదైన మార్క్ చూపించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ రెండు సినిమాలతో… ఆయనపై గౌరవం, నమ్మకం చాలా చాలా పెరిగిపోయాయి. అయితే ఆ తరవాత ‘ముకుంద’ యావరేజ్ గా ఆడింది. భారీ అంచనాలతో రూపొందిన ‘బ్రహ్మోత్సవం’ డిజాస్టర్‌గా మిగిలింది. ఈ సినిమాతో శ్రీకాంత్ కెరీర్ ఒక్కసారిగా తలకిందులైంది. తనని తాను నిరూపించుకోక తప్పని పరిస్థితుల్లో ‘నారప్ప’ తీయాల్సివచ్చింది. ఆ సినిమాలో దర్శకుడిగా తనదైన మార్క్ ఏమీ చూపించలేకపోయాడు. పైగా ఓటీటీలో విడుదలవ్వడం, ఆ సినిమాకి అంతంత మాత్రమైన స్పందన రావడంతో, శ్రీకాంత్ మరింత డౌన్ అయ్యాడు.
అయితే ‘నారప్ప’ టైమ్ లోనే ‘అన్నాయ్’ అనే మరో కథ తెరపైకొచ్చింది. ఇద్దరు బడా స్టార్లతో ఈ సినిమాని మల్టీస్టారర్ చిత్రంగా రూపొందించాలన్నది ఆయన ఆలోచన. చిరంజీవి, అల్లు అర్జున్లకైతే ఈ కథ బాగుంటుందనిపించి, గీతా ఆర్ట్స్‌లో కథ వినిపించారు. లైన్ బాగా నచ్చడంతో అల్లు అరవింద్ కూడా ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపించారు. కానీ ఇప్పుడు ‘అన్నాయ్’ కథ విషయంలో శ్రీకాంత్ సైలెంట్ అయిపోయాడు. గీతా ఆర్ట్స్ నుంచి ఈ కథ పూర్తి చేయమని ఒత్తిడి వస్తున్నా, శ్రీకాంత్ నుంచి స్పందన లేదని సమాచారం. శ్రీకాంత్ ఈకథని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దడానికి మరింత సమయం తీసుకోవాలని అనుకుంటున్నాడని, ఈలోగా ఓ చిన్న సినిమాని తీయాలన్న ప్లాన్ లో ఉన్నాడని తెలుస్తోంది. ఓ నిర్మాత తనయుడ్ని హీరోగా పరిచయం చేస్తూ, శ్రీకాంత్ అడ్డాల ఓ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడని, ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడని టాక్. ఈ సినిమా విడుదలయ్యాకే.. `అన్నాయ్`పై దృష్టి పెడతాడట. అంత వరకూ గీతా ఆర్ట్స్ ఆగాల్సిందే.