చిరంజీవి – బాబి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈచిత్రంలో కథానాయికగా శ్రుతిహాసన్ ని ఎంచుకున్నారు. చిరు – శ్రుతి కలసి నటించడం ఇదే తొలిసారి. మరోవైపు నందమూరి బాలకృష్ణతోనూ ఓ సినిమాచేస్తోంది. బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబోలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో శ్రుతినే కథానాయిక. ఈరెండు సినిమాలూ ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్నా – రెండు సినిమాల పారితోషికాల్లో చాలా తేడా ఉంది. చిరు సినిమా కోసం రూ.2 కోట్ల పారితోషికం అందుకుంది శ్రుతి. అదే బాలయ్య సినిమాకి రూ.1.5 కోట్లకు తెగ్గొట్టేసిందని టాక్. ఇద్దరూ సీనియర్ హీరోలే. రెండూ క్రేజీ ప్రాజెక్టులే. అలాంటప్పుడు… ఇంత తేడా ఏమిటన్నది ప్రశ్న.
నిజానికి సినిమాని బట్టి, తమ కాల్షీట్లని బట్టి, ఆ ప్రొడక్షన్ హౌస్తోనో, లేదంటే దర్శకుడితోనో, హీరోతోనూ తమకున్న ఎటాచ్మెంట్ ని బట్టి హీరోయిన్లు పారితోషికాలు డిమాండ్ చేస్తుంటారు. గోపీచంద్ మలినేనితో.. శ్రుతికి మంచి బాండింగ్ ఉంది. గోపీచంద్ గత చిత్రాలు బలుపు, క్రాక్లలో శ్రుతినే కథానాయిక. సెంటిమెంట్ గా తనకు శ్రుతి బాగా కలిసొచ్చింది. శ్రుతికీ అంతే. అందుకే.. శ్రుతి కూడా బాలయ్యతో సినిమా అనగానే పారితోషికం విషయంలో పెద్దగా పేచీ పెట్టలేదని తెలుస్తోంది. చిరు సినిమాకొస్తే.. శ్రుతికి అలాంటి మొహమాటాలేం లేకపోయేసరికి.. రూ.2 కోట్లు డిమాండ్ చేసిందని, మైత్రీ మూవీస్ కూడా రూ.2 కోట్లు ఇవ్వడానికి రెడీ అయిపోయిందని, అందుకే ఈ సినిమా చేయడానికి శ్రుతి ముందుకొచ్చిందని టాక్.