ప్రధాని మోదీ గుజరాత్ ప్రధానిగా వ్యవహరిస్తున్నారని.. ఆయనది కురచ బుద్ది అని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల ప్రెస్మీట్లో ఆరోపించారు. దానికి కారణం.. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని గుజరాత్ తరలించేదానికి ప్రయత్నించారని. ఇప్పుడునిజంగానే హైదరాబాద్ రావాల్సిన ఓ అత్యంత ముఖ్యమైన కేంద్రానికి గుజరాత్‌కు తరలించేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. కేంద్ర ఆయుష్ శాఖే ఈ మేరకు సమాచారం పంపింది. తెలంగాణ ప్రభుత్వం రెండుస్థలాలను చూపించింది. అయితే ఆ రెండింటిపై కేంద్రం సంతృప్తి చెందలేదు. మరో స్థలం చూపిస్తామని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఇలా సంప్రదింపులు జరుగుతూండగానే… తాజా మంత్రివర్గ సమావేశంలో అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రాన్ని గుజరాత్‌కు కేటాయిస్తూ నిర్ణయం తీసేసుకున్నారు.
సహజంగానే ఇది రాజకీయ సంచలనం కావడం ఖాయంగా కనిపిస్తోంది . అసలే బీజేపీ – టీఆర్ఎస్ మధ్య పరిస్థితి ఉప్పునిప్పులా ఉంది. భూమి కేటాయించలేదని బీజేపీ ఎదురుదాడి చేసే అవకాశం ఉంది. ఏదైనా తేల్చకుండానే గుజరాత్‌కు తరలించడం వివక్ష చూపడమేనని టీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుంది. ఈ రాజకీయం జోరుగా సాగుతుంది. కానీ హైదరాబాద్‌కు రావాల్సిన అతి ముఖ్యమైన గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కేంద్రం దాటివెళ్లిపోయింది.