ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతాయని వచ్చిన అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. యూపీలో సీట్లు పడిపోతాయని.. బొటాబొటి మెజార్టీతో గట్టెక్కుతుందని చాలా సర్వేలు చెప్పాయి. కానీ గతంలోలానే ఏకపక్ష పోలింగ్ జరిగిందని ఫలితాలతో వెల్లడయింది. ఇతర పక్షాలన్నీ బలహీనపడ్డాయి. ఎస్పీ మాత్రం కొంత బలపడింది. బీజేపీకి స్వల్పంగా సీట్లు తగ్గాయి. అయితే ఐదేళ్ల పరిపాలన తర్వాత అంత పెద్ద రాష్ట్రంలో అధికార వ్యతిరేకతను అధిగమించడం చిన్న విషయంకాదని అనుకోవచ్చు. యూపీలో బీజేపీ 246 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమయింది. ఇంత భారీ విజయాన్ని బీజేపీ నేతలు సైతం ఊహించలేదు. అటు మోడీ..ఇటు యోగి జోడు గుర్రాల్లా పార్టీని పరుగులు పెట్టించారు. సరైన సమయంలో రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారు. దీంతో బీజేపీ విజయం సునాయాసమయింది.
ఇక ఉత్తరాఖండ్‌లో అధికార వ్యతిరేకత ఎక్కువగాఉంది. అందుకే బీజేపీ మూడు సార్లు సీఎంలను మార్చింది. సర్వేల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పారు. కానీ బీజేపీ అక్కడ 70 స్థానాల్లో ఏకంగా 48 గెల్చుకుంది. హంగ్ ఖాయమనుకున్న గోవాలో .. బీజేపీ సాధారణ మెజార్టీ సాధించింది. మొత్తం నలభై స్థానాలున్న గోవా అసెంబ్లీలో 20 బీజేపీ గెల్చుకుంది. మరొక్కరు ఎవరైనా మద్దతు పలికితే ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఇక మణిపూర్‌లో కూడా బీజేపీ అధికారం సాధించడం ఖాయమే.
ఎలా చూసినా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఏకపక్ష ఫలితాలు వచ్చాయి. పంజాబ్‌లో బీజేపీకి మొదటి నుంచి బలం లేదు. అకాలీ కూటమితో కలిసి పోటీ చేస్తూ వస్తోంది. అకాలీదళ్‌తో కలిసి పోటీ చేసేటప్పుడు అతి తక్కువ స్థానాలకు పరిమితమయ్యేది. ఈ కారణంగా బీజేపీకి అక్కడ పట్టు లేకుండా పోయింది. కెప్టెన్ అమరీందర్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ప్రయోజనం కలగలేదు. పంజాబ్ ఎదురు దెబ్బలు మినహా అన్ని చోట్లా బీజేపీ విజయం సాధించింది.
బీజేపీకి ఎన్నికలకు ముందు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి… వాటన్నింటినీ సులువుగా అధిగమించింది. బీజేపీ అంటే ఫ్లవర్ కాదని… ఫైర్ అని మరోసారి నిరూపించారు.