ప్రధానమంత్రి నరేంద్రమోడీకి పోటీగా ఎవరు ఉంటారనే అంశంపై జరుగుతున్న రేసులోకి.,. తాజాగా ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ దూసుకొచ్చారు. ఇప్పటి వరకూ మమతా బెనర్జీ, కేసీఆర్ ఆ స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీలతో సాధ్యం కాదని.. ఇతర పార్టీల నేతలను కూడా దగ్గరకు తీసుకుంటున్నారు. అయితే కేజ్రీవాల్ మాత్రం ఎవరితోనూ కలవకుండా తమ పార్టీనే జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఢిల్లీ బయట కేజ్రీవాల్ పార్టీ ఓ పెద్ద రాష్ట్రంలో ఘన విజయం సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయనపైనే పడింది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తాము కూడా ఆయా రాష్ట్రాల్లో ఎదుగుతామని డాన్సులు కూడా చేశారు. చివరికి ఏపీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు భవిష్యత్ తమదేనని ధీమాగా చెప్పుకోవడం ప్రారంభించారు. ఇక అంతో ఇంతో ఉనికి కనిపించే రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ హడావుడి గురించి చెప్పాల్సిన పని లేదు.
సంప్రదాయ రాజకీయ పక్షాలకు భిన్నమైన పార్టీగా 2013లో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీతో పోల్చితే ప్రస్తుత ఆప్ ఒక ‘కొత్త’ పార్టీ అనుకోవచ్చు. మరిన్ని రాష్ట్రాల్లోనూ ఆమ్ ఆద్మీ ప్రాభవం పెంచుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. అదే జరిగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి విపక్షాల తరపున ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్ ఆవిర్భవించినా ఆశ్చర్యం లేదన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. దిల్లీని ఒక మోడల్‌గా చేసి దానిని జాతీయ స్థాయిలో అందించడానికి కచ్చితంగా ప్రయత్నిస్తారు. అయితే దానికి ఇప్పుడు లభించిన విజయాలు సరిపోతాయా లేదా అన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
మిగతా రాజకీయ నేతలందరూ… కూటమి కట్టి బలంగా ముందుకెళ్లాలనుకుంటున్నారు. కానీకేజ్రీవాల్ తన పార్టీనే ఎదిగేలా చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు “దేశ్ కీ నేత” రేసులోకి మరొకరు పెరిగిటన్లయింది. చివరికి ఎవరు ఉంటారో ?