రాజమండ్రి తొక్కిసలాట దుర్ఘటనకు నూటికి నూరుపాళ్ళూ ప్రభుత్వ, పోలీసుల వైఫల్యమే కారణమని స్థానికులు, యాత్రికులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇంకా మూడు ఘాట్లున్నప్పటికీ వాటిగురించి అవగాహనలేని దూరప్రాంతాల యాత్రికులు ఒకే ఘాట్‌కు పోటెత్తటమే ప్రధాన కారణం. అదే పుష్కర ఘాట్. పేరే పుష్కర ఘాట్ అయిన కారణంగా, గోదావరి పుష్కరాలకు సంబందించి అనేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన ఘాట్ అయివుండటం మూలాన, ఆయన స్వయంగా స్నానం చేసిన ఘాట్ అవటంవల్లా భక్తులందరూ అదే ఘాట్‌కు తరలివచ్చారు.
ఈ ఘాట్ ని రోడ్డుని వేరుచేస్తూ పెద్దగోడ వుంది. లోనికి మూడుగేట్లు వున్నాయి. ముఖ్యమంత్రి స్నానం చేసి వెళ్ళేవరకూ, దాదాపు మూడుగంటలపాటు పోలీసులు అనుమతించని కారణంగా క్యూలలో యాత్రికులు నీరసించిపోతూ అసహనంగా వుండిపోయారు. ముఖ్యమంత్రి వెళ్ళిపోగానే వారంతా విరుచుకుపడినట్టు లోనికి ప్రవేశించారు. వీవీఐపీ వెళ్ళిపోగానే రిలాక్స్ అయిపోయిన పోలీసులు యాత్రికుల రద్దీని అదుపుచేయలేకపోయారు. మూడుగేట్లలో ఒక్కగేటుని కూడా ఎగ్జిట్ గేటుగా వుంచలేదు. బయటికి వెళ్ళే తొందరలో యువకులు గోడఎక్కి దూకడంతో ఏదో జరిగిపోతోందన్న భయమే తొక్కిసలాటకు కారణమైంది.
ఇందులో పోలీసు వైఫల్యమే కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అయితే కనిపించని సమన్వయ రాహిత్యమే అసలు మూలం. ప్రతీ రైలూ గోదావరి స్టేషన్ లో ఆపుతున్నామని పుష్కరాల అధికారులు ప్రకటించారు. గంటలకొద్దీ జాప్యంతో వచ్చిన మూడు రైళ్ళు ఒకేసారి పెద్దస్టేషన్ లోనే ఆగాయి. అక్కడ ఉచిత బస్సులు లేవు. ఆటోలులేవు. డిపార్టుమెంట్ల వాహనాల పార్కింగ్ ప్లేస్ గానే రైల్వేస్టేషన్ మిగిలిపోయింది. తెల్లవార్లూ ప్రయాణపు అలసట…అలాగే సామాను మోసుకుంటూ ఐదు కిలోమీటర్ల నడక అక్కడ క్యూలో పడిగాపులు…లౌడ్ స్పీకర్లలో ”ఉచిత బస్సులు కలవు..మీరు చేరవలసిన ఘాట్ సమీపంలో దిగి పుణ్యస్నానమాచరించి తరించండి” అనే అనౌన్స్ మెంట్లు బేరికేడ్లలో వున్న యాత్రికులను తీవ్రమైన చికాకు కలిగించాయి.
రోడ్లమీద నాలుగు వరుసల బారికేడ్లు పాతడం వల్ల జనప్రవాహాన్ని నిరోధించి కృత్రిమ రద్దీసృష్టించడమేనని ,ఫ్రీగా విడిచిపెడితే తొందరగా యాత్రికులు త్వరితంగా సాగిపోతారనీ, ఇందువల్ల బారికేడ్లను తొలగించి, అవసరాన్ని బట్టి మొత్తం రోడ్డునే తాత్కాలికంగా బ్లాక్ చేయవచ్చనీ, గత పుష్కరాల అనుభవాలరీత్యా సూచించిన హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంత చెప్పినా పోలీసు అధికారులు వినలేదు.
ఒక పోలీసు అధికారి ”సిఎం హేస్ అప్రూవ్డ్ అవర్ ప్లాన్ ”అని వీరికి సమాధానమిచ్చాడని తెలిసింది. ఇది నిజమే అయితే ఈ దారుణానికి ముఖ్యమంత్రే కారణమనుకోవాలి..వీవీఐపీని మాత్రమే పట్టించుకునే పోలీసు, సివిల్ యంత్రాంగానిదే పాపమనుకోవాలి.