హైదరాబాద్: ఐపీఎల్ టోర్నమెంట్లో అక్రమాలపై విచారణకు సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ ఇవాళ తన తీర్పు వెలువరించింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు రెండేళ్ళపాటు ఐపీఎల్లో ఆడకుండా నిషేధం విధించింది. 2013లో బయటపడిన బెట్టింగ్ కుంభకోణంపై విచారణ జరిపిన కమిటీ ఈ తీర్పు ఇచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన గురునాథ్ మెయ్యప్పన్, రాజస్థాన్ రాయల్స్ జట్టు యజమాని రాజ్ కుంద్రాలపై బీసీసీఐ నిర్వహించే ఏ క్రికెట్ మ్యాచ్లోనూ పాలుపంచుకోగూడదంటూ జీవితకాల ఆంక్షలు విధించింది. త్రిసభ్య కమిటీకి నేతృత్వం వహించిన జస్టిస్ లోధా ఇవాళ తన తీర్పును వెలువరిస్తూ గురునాథ్ మెయ్యప్పన్, రాజ్ కుంద్రా క్రికెట్ క్రీడకు చెడ్డపేరు తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు.