పేర్ని నాని స్థానంలో కొత్త ఐ అండ్ పీఆర్ మంత్రిగా నియమితులైన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తొలి రోజే జర్నలిస్టులకు ఉపదేశం చేశారు. ఆయన పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా జర్నలిస్టులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు తన ఉపదేశం వినిపించారు. జర్నలిస్టులు చేయాల్సింది ఆరా తీయడం కాదని.. ఆరాధాన చేసుకోవడం అని.. జగన్ను ఆరాధిస్తే అంతా మంచే జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఆఱాధనవల్ల ఎంత మేలు జరుగుతుందో తననే స్వయంగా ఉదాహరణగా చూపించారు.
జగన్ను ఆరాధించడం వల్లే తనకు మంత్రి పదవి వచ్చిందని చెప్పుకున్నారు. అందుకే జర్నలిస్టులు కూడా ఆరాధించాలని సలహా ఇచ్చారు. పేర్ని నాని అలాంటి సలహాలు జర్నలిస్టులకు ఇవ్వలేదు. కానీ ఓ వర్గం మీడియాను మాత్రమే దగ్గరకు రానిచ్చేవారు. కొత్త మంత్రి మాత్రం మరింత దూకుడుగా ఉన్నారు. జగన్ను ఆరాధించుకోమంటున్నారు. చెల్లబోయిన వేణుగోపాల కృష్ణ తీరు చూసి జర్నలిస్టులు ముందు ఆశ్చర్యపోయినా తర్వాత నవ్వకున్నారు. మంత్రి పదవి వచ్చిన కొత్తలో అలాగే ఉంటుందని ముందు ముందు అంతా తెలుస్తుందని సెటైర్లు వేసుకున్నారు.
ఇంత కాలం వైసీపీలో ఉన్న వారంతా ఆరాధించారని.. ఇప్పుడు పదవులు ఎందుకు పోయాయనే సంగతిని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఐ అండ్ పీఆర్ మంత్రి తీరుపై జర్నలిస్టులకు మొదటి రోజే ఓ అవగాహన వచ్చినట్లయింది.