వైసీపీలో అసంతృప్తి చప్పున చల్లారిపోయింది. నిన్నటిదాకా తమ అనుచరులతో ఆందోళనలు చేయించిన వారంతా ఇవాళ జగన్‌ను కలిసి .. అసంతృప్తేమీ లేదని ప్రకటించేశారు. మొత్తం వ్యవహారాన్ని సీఎం జగన్ టీ కప్పులో తుఫాన్‌గా తేల్చేశారు. ఎక్కువగా ఆశలు పెట్టుకుని భంగపడిన ఎమ్మెల్యేలను సీఎం జగన్ స్వయంగా పిలిపించుకుని మాట్లాడి సర్ది చెప్పారు. మంత్రి పదవి రాకపోయినా పార్టీలో ఏ మాత్రం ప్రాధాన్యం తగ్గదని వారికి హామీ ఇచ్చారు. దాంతో వారంతా.. తమకేమీ అసంతృప్తి లేదని ప్రకటించారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి, సుచరిత వంటి తాజా మాజీ మంత్రులు … పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సామినేని ఉదయభాను, పార్థసారధి వంటి సీనియర్ ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురయ్యారు.బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే ఇక రాజీనామా చేస్తారేమోనన్నంతగా ప్రచారం జరిగింది. కానీ జగన్ అసంతృప్తులపై దృష్టి పెట్టారు. ఆయా నేతలతో మాట్లాడి సర్ది చెప్పేందుకు సీనియర్ నేతలను పంపించారు. వారు చర్చలు పూర్తి చేశారు. బాలినేని సహా అందరూ పిన్నెల్లి, ఉదయభాను అందరూ తమకేమీ అసంతృప్తి లేదని.. పార్టీ కోసం పని చేస్తామని ప్రకటించారు. దీంతో కథ సుఖాంతమైంది.
అయితే ఈ అసంతృప్తి ఎపిసోడ్లో కాస్త ఎక్కువ ఆవేశ పడిన సుచరితకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. సుచరిత తీరుపై జగన్ అసహనంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. జగన్ నిర్ణయాన్ని ధిక్కరించడమే కాకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. అసంతృప్తి వ్యక్తం చేసినా చాలా మంది బయట ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ సుచరిత మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. సుచరిత అనుచరులు.. తమకు హైకమాండ్ సుచరిత అని ప్రకటించారు. దీంతో ఆమెను లైట్ తీసుకోవాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.