తెలంగాణ బీజేపీలో కొత్త పంచాయతీ ప్రారంభమయింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరుపై రఘునందన్ రావు అసంతృప్తిగా ఉన్నారు. బండి సంజయ్ తనను పట్టించుకోవడం లేదని ఫీలవుతున్నారు. పాదయాత్ర రెండో విడత ప్రారంభ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. బండి సంజయ్ తనను ఆహ్వానించలేదని పిలవకుండా వెళ్లి అవమానపడదల్చుకోలేదని ఆయన అంటున్నారు. మొదటి విడత పాదయాత్ర మెదక్ జిల్లాలో సాగిన తనకు సమాచారం ఇవ్వలేదని రఘునందన్ అంటున్నారు.
బీజేపీలో రఘునందన్ తీరు ఇటీవలి కాలంలో రెబల్‌గా కనిపిస్తోంది. ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలు అయినా .. ఆయన బీజేపీఎల్పీ భేటీకి హాజరు కావడం లేదు. రాజాసింగ్ ప్లేస్‌లో తనకు ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు . కానీ బండి సంజయ్ మాత్రం అడ్డు పడుతున్నట్లుగా తెలుస్తోంది. బండి సంజయ్ కు.. రఘునందన్‌కు వివిధ అంశాల్లో గ్యాప్ పెరిగిపోతోంది. చివరికి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లుగా ఎన్నికైన వారిలో ఫ్లోర్ లీడర్ల పదవులను కూడా భర్తీ చేయలేదని.. రఘునందన్ అంటున్నారు. తనకు సంబంధించిన వారిని సిఫార్సు చేశారని అందుకే పెండింగ్‌లో పెట్టారని రఘునందన్ అనుమానపడుతున్నారు.
రఘునందన్‌పై ఇటీవల బీజేపీలోని ఓ వర్గం వ్యతిరేక ప్రచారం చేస్తోంది. ఆయన బీజేపీలో ఉండరని వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్లో చేరిపోతారని.. మెదక్ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్నారు. అయితే రఘునందన్ మాత్రం తాను బీజేపీని వదిలి పెట్టే ప్రశ్నే లేదంటున్నారు.